కొత్తూరు, మే 22 : సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు వద్దే..వద్దన్న నిరసన కలెక్టరేట్‌ను తాకింది. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’కు కొత్తూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివెళ్లి తమ నిరసన తెలిపారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని చూస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు హెచ్చరించారు.
వారికి పరిసర గ్రామాల ప్రజలు కూడా మద్దతు ప్రకటించారు. పచ్చని పంట పొలాలు, కూత వేటు దూరంలో ప్రఖ్యాత జహంగీర్ పీర్ దర్గా ఉన్న తమ గ్రామాన్ని మరో జవహర్‌నగర్‌గా మారిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సిద్ధాపూర్లో ఉన్న టీఎస్ఐఐసీకి చెందిన భూమిలో ఐటీ టవర్స్ ఏర్పాటు చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారని.. కానీ, నేటి కాంగ్రెస్ పాలకులు చెత్త కుప్పను తెచ్చి తమ నెత్తిన పెడితే సహించేది లేదన్నారు. ఇప్పటికైనా ఆ ప్రతిపాదనను విరమించుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మండల ప్రజలు మేలుకొని డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టకపోతే పెను ప్రమాదం తప్పదని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.