పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు వచ్చాయి. పట్టణాల నుంచి పల్లెలకు పయనమవుతున్నారు.. జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండులన్నీ ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి. అరకొర బస్సులతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రయాణికులు అధికం కావడంతో బస్సుల్లో నుంచి ఆర్టీసీ డ్రైవర్లు కిందికి దించేస్తున్నారు. మీ వద్ద లగేజీ ఎక్కువగా ఉంది.. ఇందులో జాగా లేదు.. ఇంకో బస్సులో ఎక్కండి అని సమాధానమిస్తున్నారు. దొరికిన బస్సులో కిక్కిరిసి వెళ్తున్న జనం బస్సులో నరకయాతన అనుభవిస్తుండగా, ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ ప్రమాదానికి స్వాగతం పలుకుతున్నారు. కొందరు ఆర్టీసీ బస్సులపై నమ్మకం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రాణాలమీదికొస్తున్నదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పురుషుల పరిస్థితి అయితే మరీ ఘోరం.. బస్సులో సీటు దొరకదు.. ఫుట్‌బోర్డు ప్రయాణం చేయలేదు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బస్సుపైన కూర్చుని మరీ ఊర్లకు వెళ్తున్నారు. పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బస్సులను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
– షాబాద్, జనవరి 11
జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, రాజేంద్రనగర్, ఆమనగల్లు, మహేశ్వరం తదితర నియోజకవర్గాల నుంచి సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లాలంటే తిప్పలు తప్పడం లేదు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు కిటకిటలాడుతుండగా, పురుషులకు సీట్లు దొరకక అవస్థలు పడుతున్నారు. మరి కొన్ని బస్సుల్లో ఆధార్‌కార్డు నడవకపోవడంతో మహిళలు టికెట్ తీసుకోవాల్సి వస్తున్నది. మామూలు రోజుల్లో సర్దుకుంటామని, పండుగ సమయంలో బస్సులు పెంచకపోవడంతో ప్రయాణికులు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. పండుగ వేళల్లో బస్సులు పెంచాలన్న ధ్యాస లేదా.. అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికైనా సంక్రాంతి తర్వాత మూడు, నాలుగు రోజుల వరకు బస్సుల సంఖ్య పెంచాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు.
సంక్రాంతికి సెలవు రావడంతో చేవెళ్ల నుంచి తాండూరుకు వెళ్లేందుకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎదురు చూసినా. ఏ బస్సు చూసినా జనంతో కిటకిటలాడుతున్నది. బస్సు రాగానే జనం ఎగబడుతుండ్రు. తిండి తిప్పలు లేకుండా బస్టాండ్‌లో రోజంతా ఉండాల్సి వచ్చింది. పండుగకు బస్సులను పెంచితే బాగుండేది.
– దివ్య, తాండూరు(చేవెళ్ల టౌన్)
నా కూతురు చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో చదువుతున్నది. పండుగకు సొంతూరు యాచారం తీసుకెళ్లేందుకు వచ్చాను. చేవెళ్ల బస్టాండ్‌లో బస్సులు లేక ఇబ్బందులు పడ్డం. ఇంటికెళ్లేవరకు రాత్రి అయ్యేటట్టున్నది. చాలీచాలని బస్సులతో ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం బస్సులను పెంచాలి.
– రమాదేవి, యాచారం(చేవెళ్లటౌన్)
ప్రభుత్వం ఉచిత బస్సు పథకం తీసుకొచ్చి.. బస్సులను తగ్గించింది. మహిళలు కిటకిటలాడుతుండడంతో బస్సులో ప్రయాణం చేయాలంటేనే భయం వేస్తున్నది. ఏ బస్సు చూసినా కనీసం నిలబడే సందు లేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఫుట్‌బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తున్నది. పండుగ సందర్భంగా ప్రభుత్వం బస్సులను పెంచాలి.
– శ్రీనివాస్, దేవుని ఎర్రవల్లి(చేవెళ్లటౌన్)