వికారాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన తర్వాత గుంతల రోడ్లపై జిల్లా ప్రజలు ఉద్యమ బాట పట్టారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందినవారిలో జిల్లావాసులే ఎక్కువగా ఉండటంతో జిల్లాలో అధ్వానంగా ఉన్న గుంతల రోడ్లపై ఆందోళన చేపట్టారు. తాండూరు నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, బంట్వారం, మోమిన్పేట్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలయమంగా మారింది. గాజీపూర్ బ్రిడ్జిపై రోడ్డు మొత్తం పెద్దపెద్ద గుంతలతో ప్రమాదకరంగా ఉన్నది. బుద్దారం వాగు సమీపంలో ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడి.. అక్కడే చాలా ప్రమాదాలు జరిగి పలువురు మృతిచెందిన ఘటనలున్నాయి.
‘చేతగాని కాంగ్రెస్ నాయకుల్లారా.. గద్దె దిగిపోండి’ అంటూ తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలానికి చెందిన యువకులు బుధవారం ధర్నా చేశారు. పెద్దేముల్ మండలం బుద్దారం వాగు సమీపంలో బుద్దారం, గాజీపూర్, పెద్దేముల్ గ్రామ యువకులు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గుంతలు పడి నెలల గడుస్తున్నా, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడంలేదంటూ స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా నుంచి ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్నా, వికారాబాద్ నియోజకవర్గానికి స్పీకర్ ఉన్నా కూడా జిల్లాను పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ నాయకులు గత రెండు సంవత్సరాలుగా ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప అభివృద్ధి మాత్రం గుండు సున్నా అని ఈ సందర్భంగా యువకులు అసహనం వ్యక్తం చేశారు. తాండూరు నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే మంత్రిగా పనిచేసిన మహేందర్రెడ్డి తాండూరుకు మాత్రం తాను చేసిందేమీ లేదని యువకులు విమర్శించారు. ఇకనైనా పాలకులు మారి రోడ్లపై దృష్టి సారించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా సర్కారు పెద్దలు మాత్రం తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు పట్టించుకొని రోడ్లపై దృష్టి సారించి నూతనంగా రోడ్లు నిర్మించాలి. మంబాపూర్ నుంచి మారేపల్లి వెళ్లే రహదారిలో మంబాపూర్ ప్రధాన రోడ్డుపై ప్రమాదకరంగా గుంతలు ఏర్పడి నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.
– కేసీ బాలప్ప, జనగాం, పెద్దేముల్ మండలం
మంబాపూర్ మాజీ సర్పంచ్, పెద్దేముల్ మండలం పాలకుల వైఫల్యంతోనే..ప్రధాన రహదారులపై ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డా ఏ ఒక్క నాయకుడు కాని, అధికారి కాని పట్టించుకోవడంలేదు. చేవెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మా అన్న కూతురు బోయిని స్వప్న చావు అంచుల దాకా వెళ్లింది. దీనికంతటికి కారణం పాలకుల వైఫల్యం. ఇకనైనా రోడ్ల మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి.
– – రేగొండి శ్రావణ్, బోయిని మల్లప్ప, ఖానాపూర్ గ్రామం, పెద్దేముల్ మండలం
ఎర్రగడ్డ తండా సమీపంలో రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు ఎక్కడ ఉందో వెతుక్కుని వెళ్లాల్సిన పరిస్థితి తయారైంది. మా దరిగడ్డ ప్రాంతం అంటే నాయకులందరికీ చిన్నచూపుగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇకనైనా నాయకులు, అధికారులు స్పందించి మా గ్రామం గుండా జహీరాబాద్ వెళ్లే ప్రధాన రోడ్డును బాగు చేయాలి.
– ఆంజనేయులు, పీఎసీఎస్ వైస్ చైర్మన్, తట్టేపల్లి