శాననసభ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలపై గళమెత్తి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే సస్పెండ్ చేస్తారా..? అని మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అక్రమ సస్పెన్షన్‌ను ఖండిస్తూ షాద్‌నగర్‌లో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మొయినాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజ లు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఐ పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు వారిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. అదేవిధంగా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ మాజీ జడ్పీటీసీ మహిపాల్ సారథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహ నం చేశారు.
సమస్యలపై పోరాడుతున్న జగదీశ్‌రెడ్డిని శాసనసభ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కోని రాజు తదితరులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ ను దహనం చేశారు. అదేవిధంగా రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ విధించడాన్ని నిరసిస్తూ పరిగిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతునొక్కుతారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ అనైతికం, అప్రజాస్వామికమన్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఓర్వలేక.. ఉద్దేశపూర్వకంగానే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ వేశారని మండిపడ్డారు.
మొయినాబాద్, మార్చి 13 : ప్రజల పక్షాన ప్రశ్నిస్తే ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నదని.. ఇలాంటి ధోరణిని ప్రభుత్వం కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శాసనసభ సమావేశాల నుంచి జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం మొయినాబాద్‌లో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను సీఐ పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేయాలని అసెంబ్లీలో గళమెత్తిన జగదీశ్వర్‌రెడ్డిని అధికారం బలంతో సస్పెండ్ చేయడం సభా సాంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సూచనలు, సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా సభను నడపాలనే ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గమైన ఆలోచన విధానాలను ప్రజలకు వివరించి ఎండగడతామని చెప్పారు. ఉద్యమాలు, పోరాటాలు చేయడం బీఆర్ఎస్కు కొత్త కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్‌యాదవ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ : ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. జగదీశ్‌రెడ్డి అక్రమ సస్పెన్షన్‌ను ఖండిస్తూ షాద్‌నగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి వస్తున్న ప్రజా సమస్యలు, ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. బడ్జెట్ సమావేశాల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే ఓర్వలేక ఉద్దేశపూర్వకంగానే కుట్రలకు పాల్పడుతూ సభ నుంచి బయటకు పంపుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ కవిత, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎంఎస్.నటరాజ్, ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, నాయకులు పాల్గొన్నారు.
దౌల్తాబాద్ : బీఆర్ఎస్ పార్టీ మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్, పార్టీ మండల నాయకత్వం ఆధ్వర్యంలో దౌల్తాబాద్‌లోని శివాజీ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న మాజీ మంత్రిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేని స్థితిలో ఉన్న సర్కారు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలో నిర్ణయించుకున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : ప్రభుత్వ అసమర్థతను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కోని రాజు, బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్, మున్సిపల్ అధ్యక్షుడు మడుపు శివసాయిలు అన్నారు. జగదీశ్వర్‌రెడ్డి సస్పెండ్‌ను నిరసిస్తూ శనివారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సమస్యలపై పోరాడుతున్న ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలోకి రేవంత్‌రెడ్డి వస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. సస్పెన్షన్‌కు భయపడేది లేదని.. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్‌కుమార్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్‌రెడ్డి, నాయకులున్నారు.
పరిగి : ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదని ఆరోపించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అనని మాటను అన్నట్లుగా చూపి సస్పెన్షన్‌కు ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. ఇందుకు నిరసనగా శుక్రవారం పరిగిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. బీఆర్ఎస్ నాయకులను పరిగి పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.