రంగారెడ్డిజిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అన్నిఅర్హతలున్నప్పటికీ రాజకీయ సిఫార్సు లేకపోవడం వలన తమకు ఇండ్లు దక్కలేదని పలువురు వాపోతున్నారు. అర్హుల జాబితాను గ్రామాల్లో అధికారికంగా ప్రకటిస్తున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో అర్హులైనవారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 18 వేల ఇండ్లకుగానూ నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారు. దీంతో ఆయా గ్రామాల్లో బూత్‌లవారీగా ఇండ్ల జాబితాను విడుదల చేస్తున్నారు. ముందుగా ప్రభుత్వం రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికి ఇండ్లు ఇస్తామని ప్రకటించింది. కాని, జాబితాలో మాత్రం రాజకీయ సిఫార్సులున్నవారి పేర్లు మాత్రమే వచ్చాయని వాపోతున్నారు.
ఇందిరమ్మ కమిటీ సూచించిన మేరకే అధికారులు లిస్టు తయారు చేస్తున్నారని చెబుతున్నప్పటికీ ఎంపిక మాత్రం అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లో జరిగినట్లు స్పష్టమవుతున్నది. జిల్లావ్యాప్తంగా ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు గ్రామాలవారీగా లిస్టులను ప్రకటిస్తున్నారు. గతంలో లిస్టులో పేరున్న అనేకమంది అర్హత పొందిన జాబితాలో పేర్లు లేకపోవడంతో తీవ్రంగా నిరుత్సాహపడుతున్నారు. పలుచోట్ల అధికారులు, కమిటీ సభ్యులను నిలదీస్తున్నారు.
– రంగారెడ్డి, మే 26 (నమస్తే తెలంగాణ)
ఇందిరమ్మ ఇండ్ల కోసం జిల్లావ్యాప్తంగా 80.50 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో 71 లక్షలకు పైగా ఇండ్లను అధికారులు పరిశీలించారు. వీటిలో 18.32 లక్షల మంది అర్హులున్నారు. కాని, జిల్లాకు మంజూరైన ఇండ్లు మాత్రం 18 వేలు మాత్రమే. మొదటి విడతలో 18 వేల మందికి సంబంధించిన జాబితా ప్రకారం అధికారులు ఇండ్లను కేటాయిస్తున్నారు. 18 లక్షల మందిలో కేవలం 18 వేల మందికి మాత్రమే ఇండ్లు వచ్చాయని, మిగతావారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
రాజకీయ జోక్యం ఉన్నవారికే ఇండ్లు..!
ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 80.50 లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. కుల గణన, ఇంటింటి సర్వేలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను గుర్తించారు. కాని, జాబితాలో మాత్రం అధికారులు గుర్తించిన వారికి కాకుండా అధికార పార్టీ అండదండలున్నవారికే ఇండ్లు కేటాయింపులు జరిగాయి. మరోవైపు అర్హత లేకున్నా రాజకీయ సిఫార్సులున్నవారిలో ఎంతోమందికి ఇండ్లు దక్కాయి. దీంతో జిల్లాలో ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా జరగలేదని పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏండ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన పేదలకు ఈసారి కూడా అవకాశం దక్కకపోవడంతో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించి ఇండ్లు కేటాయించలేదని ఆరోపణలొస్తున్నాయి.