పరిగి, ఆగస్టు 3 : పరిగి మున్సిపాలిటీ 5వ వార్డులోని ప్రధాన రహదారి బురదమయంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొంటూ కాలనీవాసులు శనివారం రోడ్డుపై బురదలో నాట్లు వేసి నిరసన తెలిపారు. పట్టణంలోని కొడంగల్ క్రాస్‌రోడ్డు నుంచి బాలాజీనగర్, వెంకటేశ్వర స్వామి దేవాలయం రోడ్డు వర్షపు నీటితో బురదమయంగా మారింది.
ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, గుంతలు పూడ్చి రోడ్డును బాగు చేయాలని కోరినా అధికారులు ఇటువైపు రావడం లేదని కాలనీవాసులు ఆరోపించారు. తమ కాలనీలో ప్రధాన రహదారి, మురికి కాలువల నిర్మాణం సైతం చేపట్టలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై గుంతలు పూడ్చి రవాణాకు అనుగుణంగా మార్చాలని కోరారు.