వికారాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో చేతికొచ్చిన పంటను విక్రయించేందుకు రైతన్న అరిగోస పడుతున్నాడు. గత నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో పంటను కల్లా లు, రోడ్లు, ఇండ్ల ఎదుట ఆరబెట్టి ప్రభుత్వం ఎప్పుడు కాంటా పెడుతుం దా?.. ఎప్పుడు విక్రయిద్దామా..? అని ఎదురుచూస్తున్నాడు. ప్రతిఏటా ఈ సమయానికి ధాన్యం సేకరణ ముగిసే పరిస్థితి ఉండగా.. ఈ ఏడాది మాత్రం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో తీవ్ర జాప్యం జరుగుతున్నది. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉన్నది. సాగయ్యే ధాన్యాన్ని బట్టి గన్నీ బ్యాగులను ముందే సమకూర్చాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఓపీఎంఎస్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి చాలా కొనుగోలు కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తరచూ తలెత్తుతుండడం ..వాటిని పరిష్కరించేందుకు జిల్లాలో సిబ్బంది లేకపోవడంతో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు ఇప్పటివరకు సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు మిల్లర్లు నో చెబుతున్న ట్టు తెలిసింది. 2019 నుంచి మిల్లర్లకు ఇవ్వాల్సిన మిల్లింగ్ చార్జీలను ప్రభుత్వం విడుదల చేసినా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు వారికి అందజేయకపోవడంతో ధాన్యాన్ని మిల్లులకు అనుమతిస్తలేరు. దీంతో కేంద్రాల్లోనే ధాన్యం ఉండిపోతుండడంతో మిగతా రైతులు తెచ్చే ధాన్యాన్ని సేకరించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది.
కొన్నది కొంతే..
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇప్పటివరకు జిల్లా పౌరసరఫరాల శాఖ నిర్దేశించిన లక్ష్యంలో కనీసం 50 శాతం కూడా సేకరించనట్టు సమాచారం. ఇప్పటివరకు కేవ లం 49,285 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. జిల్లాలో 129 కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు భావించగా.. కేవలం 57 కేంద్రాల్లోనే వడ్ల సేకరణ జరుగుతున్నది. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 18 కేంద్రాలు, ఐకేపీ-12 కేంద్రాల్లో, పీఏసీఎస్-27 కేంద్రాల్లోనే సేకరణ జరుగుతున్నది.
జిల్లాలోని 864 మంది రైతుల నుంచి 49,285 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మా త్రమే సేకరించారు. ఇప్పటివరకు రూ. 11.82 కోట్ల విలువ గల ధాన్యాన్ని సేకరించగా, రూ.5.72 కోట్లను రైతుల బ్యాం కు ఖాతాల్లో జమ చేశారు. మరో రూ. 6.10 కోట్ల చెల్లింపులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నది. యా సంగిలో లక్షా5 వేల ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా ఏ గ్రేడ్‌కు రూ.2389, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ అందించనున్నారు.

క్వింటాల్‌కు 10 కిలోల తరుగు
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు పేరిట రైతులను దోపిడీ చేస్తున్నారు. క్వింటాకు 10 కిలోల వరకు తరుగు పేరిట తూకం వేస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బస్తాలో 40 కిలోల ధాన్యాన్ని తూకం వేస్తుండగా, తరుగు ఒక్కో బస్తాకు 4 కిలోలు తీస్తున్నారు. క్వింటాకు 10 కిలో ల వరకు అదనంగా తూకం వేస్తూ తరు గు పేరిట రైతుల నుంచి నిర్వాహకులు కొట్టేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వానకాలంలో ధాన్యం కొనుగోళ్లలో తేమ పేరిట, యాసంగిలో తరుగు పేరిట రైతులకు కేంద్రాల నిర్వాహకులు నష్టం చేకూరుస్తుండడంపై జిల్లా రైతాంగం అసంతృ ప్తి వ్యక్తం చేస్తున్నది. బుధవారం యా లాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్‌లోని కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌కు రైతులు తమ గోడును చెప్పుకొన్నారు. తరుగు పేరిట ఒక్కో బస్తాకు 4 కిలోలను అదనంగా తీస్తున్నట్లు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
వేధిస్తున్న గన్నీ బ్యాగుల సమస్య
జిల్లాలో ఈ యాసంగిలో 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కాగా, జిల్లాలో యాసంగిలో 88 వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగుచేశారు. కానీ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల్లో 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే అధికారులు సేకరించారు. జిల్లాకు పది లక్షల గన్నీబ్యాగులు అవసరమని అంచనా వేసిన అధికారులు ఇప్పటివరకు మూడున్నర లక్షల బ్యాగులనే అందించారు. ఓవైపు గన్నీబ్యాగులు, హమాలీల కొరతతో జిల్లాలో ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు సాగడంలేదని రైతులు మండిపడుతున్నారు.
ధాన్యం తీసుకెళ్లేందుకు మిల్లర్ల నిరాకరణ
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు ప్రభుత్వం జిల్లాలో 8 రైస్‌మిల్లులను ఎంపికచేసింది. వీటిలో ఐదుచోట్ల మాత్రమే అన్లోడింగ్ జరుగుతున్నది. మిగిలిన మూడు రైస్‌మిల్లుల్లో నిల్వ చేసే సామర్థ్యం లేకపోవటంతో ధాన్యాన్ని అన్లోడింగ్ చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలున్నాయి. ప్రతిరోజూ ఒక్కో కొనుగోలు కేంద్రానికి రెండు నుంచి మూడు లారీలు అవసరం ఉండగా.. రెండు మూడురోజులకు ఒకటి రెండు లారీలు మాత్రమే వస్తున్నాయి. వెంటనే లారీలను పంపించాలని రైతులు కోరుతున్నా.. లారీలు రాకపోగా వచ్చిన లారీల్లోని వడ్లను అన్లోడింగ్ చేయడంలో జాప్యం జరుగుతున్నదని రైతులు వాపోతున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్, రాచకొండ మైలారం, మంచాల మండలంలోని నోముల, మంచాల, యాచారం మండలంలోని చింతపట్ల తదితర కొనుగోలు కేంద్రాల్లో వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి. ఈ కేంద్రాలకు లారీలు రావటంలేదని రైతులు వాపోతున్నారు.
తాలు, తరుగు పేరుతో దోపిడీ..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. తేమ 15 శాతం లోపు, తాలు 3 శాతం లోపు, మట్టి పెల్లలు ఒకశాతం, ఇతర గింజలు 6శాతం, డ్యామేజీ 5 శాతం మించకూడదని నిబంధనలను సాకుగా చూపించి తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్తాకు రెండు కేజీల తాలు , తరుగు పేరుతో తీస్తున్నారని, ఈ విష యం సివిల్‌సప్లయ్ అధికారులకు తెలిసినా పట్టించుకోవటం లేదని, అలాగే, లోడింగ్, అన్లోడింగ్లోని హమాలీలు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
ఒక బస్తాకు ఐదు రూపాయల చొప్పున హమాలీలకు అనధికారంగా ఇవ్వాల్సి వస్తున్నదని.. నిరాకరిస్తే రోజుల తరబడి కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు. కాగా, మరోవైపు అన్నదాతను అకాల వర్షాలు భయపెడుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఎండబోసి, తూర్పారా బట్టి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచినా అధికారులు సకాలంలో కొనడంలేదని.. అకాల వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే యాచారం మండలంలో కురిసిన అకాల వర్షాలతో చింతపట్లలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
కేవలం 8వేల మెట్రిక్ టన్నులే..

రంగారెడ్డి, మే 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం సేకరణలో అధికారులు చేతులెత్తేశారు. ఆశించిన రీతిలో కొనుగోళ్లు జరగకపోవటంతో కల్లాల్లో ధాన్యం రాశులు పేరుకుపోతున్నాయి. ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వస్తున్నా రైస్‌మిల్లులకు మాత్రం వెళ్లడంలేదు. జిల్లాలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం 37 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఆశించిన రీతిలో సాగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేస్తుండగా.. కలెక్టర్ నారాయణరెడ్డితోపాటు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి కేంద్రాలకెళ్లి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినా పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు.
కల్లాలు, ఇండ్ల వద్ద ఆరబెడుతున్నారు..
రైతులకు సంచులిచ్చి వెంటనే ధాన్యాన్ని కొనాలి. కొనుగోలు కేంద్రాల్లో కాంటా చేయకపోవడంతో అన్నదాతలు వడ్లను రోడ్లు, కల్లాలు, ఇండ్ల వద్ద ఆరబెడుతున్నారు. అకాల వర్షాలొస్తే తడిచిపోయే ప్రమాదం ఉన్నది. అధికారులు రైతులకు ఇబ్బంది కలుగకుండా త్వరగా వడ్లను కొనాలి.
– హరీశ్‌రావు, రైతు మోమిన్‌కలాన్ గ్రామం
తూకం చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
తూకం చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి. వడ్లను తూకం చేసి రోజులు గడుస్తున్నా లారీలు రాక ధాన్యాన్ని మిల్లులకు తరలించలేకపోతున్నారు. తూకం చేసి వడ్లను అక్కడే ఉంచితే అకాల వర్షాలతో తడిచిపోయే అవకాశమున్నది. కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడంతో చాలామంది అన్నదాతలు తమ పంటను ఇండ్ల ఎదుట, రోడ్లపైనే ఆరబెట్టారు.
-లాల్‌సింగ్ రైతు, పులిచింతలమడుగుతండా, ధారూరు
సంచుల్లేక.. విక్రయాలు సాగక..
మా గ్రామంలో కొనుగోలు కేంద్రం లేక తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇక్కడ 600 ఎకరాల్లో రైతులు వరిని పండిస్తారు. తమకు సమీపంలో ఉన్న గోనూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ధాన్యాన్ని తీసుకెళ్లి విక్రయించేందుకు ఇబ్బంది పడుతున్నాం. తొమ్మిది ఎకరాల్లో వరిని సాగు చేశా. కోతలు కోసి వారం దాటింది. గన్నీబ్యాగులు దొరకక పంటను విక్రయించలేక పోతున్నా. అధికారులు స్పందించి సంచులు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
-భత్యం రవి, రైతు,నారాయణపూర్, తాండూరు
రైతుగోస ప్రభుత్వానికి పట్టదా?
ఆరుకాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు అన్నదాత తీవ్ర ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదు. కొనుగోలు కేంద్రాలను సమయానికి ఓపెన్ చేయకపోవడంతో రైతులు తమ వడ్లను రోడ్లు, కల్లాలు, ఇండ్ల ముందు ఆరబోసి రోజుల తరబడిగా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. సర్కార్ అన్నదాత ఇబ్బందులు గుర్తించి త్వరగా వడ్ల కొనుగోళ్లను పూర్తి చేసి ఆదుకోవాలి.
-చంద్రప్ప, రైతు, బాలంపేట, దౌల్తాబాద్
హమాలీల కొరతతో తూకం చేయడంలేదు..
కొనుగోలు కేంద్రంలో హమాలీల కొరతతో సకాలంలో తూకం వేయడంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరకు విక్రయించాల్సి నష్టపోవాల్సి వస్తున్నది. ఈసారి అకాల వర్షాలు మరింత ఇబ్బందిపెడుతున్నాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కష్టాలు పడుతున్నాం. వేగంగా కొనుగోళ్లు సాగితేనే రైతులకు కష్టనష్టాలు తొలగిపోతాయి.
-నితిన్‌కుమార్, రెడ్డిఘనాపూర్, బషీరాబాద్
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం తగదు
ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకెళ్తే అధికారులు కాంటా వేయడంలేదు. తూకం సమయంలో తాలు, మట్టిపెల్లల పేరుతో తరుగు తీస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు న్యాయం చేయాలి. రైతుల నుంచి ధాన్యం త్వరగా సేకరించాలి.
-శ్రీకాంత్, యువరైతు అస్మత్పూర్
ధాన్యాన్ని సేకరించడం లేదు..
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా వడ్లను కొనడంలేదు. దీంతో అన్నదాతలు తమ పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు తమ ధాన్యాన్ని రోడ్లు, కల్లాల్లోనే నిల్వ చేయగా.. మరికొందరు తక్కువ ధర వచ్చినా దళారుల కు విక్రయించి నష్టపోతున్నారు.
-గుండుమల్ల నర్సింహులు, రైతు, తిర్మలాపూర్, కులకచర్ల
కాంగ్రెస్ పాలనలో అన్నదాతకు అవస్థలు
ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. పండించిన ధాన్యా న్ని అమ్ముకునే స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో లేకుండా పోయింది. బీఆర్ఎస్ హయాంలో అన్నదాతకు ఇబ్బందుల్లేకుండా సేకరించారు. కాంగ్రెస్ పాలనలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొన్నది.
కంబాలపల్లి హన్మంత్‌రెడ్డి, రైతు, చర్లపటేల్‌గూడ