రంగారెడ్డి, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీల పథకాల అమలుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రేపటి నుంచి జనవరి 6 వరకు గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేసి, స్వీకరించిన దరఖాస్తులను ఏరోజుకారోజు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇందుకు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఎంఈవోల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించగా, పర్యవేక్షకులుగా జిల్లాస్థాయి అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రతి టీంలోనూ రెవెన్యూ, వ్యవసాయ, విద్య, వైద్య, విద్యుత్తు, పౌరసరఫరాల శాఖల అధికారులు ఉంటారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం దశల వారీగా ఆరు గ్యారెంటీల అమలుకు అర్హులను ఎంపిక చేయనున్నారు. అయితే ఆరు గ్యారెంటీల అర్హుల ఎంపికపై ప్రజల్లో పలు అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. తెల్లరేషన్ కార్డులేనివారు, రైతులు కూడా బ్యాంకు రుణాల కోసం ఐటీ చెల్లిస్తున్న దృష్ట్యా ఆరు గ్యారెంటీలు అందవేమోనని ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలనకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 28 నుంచి వచ్చే ఏడాది జనవరి 6 వరకు అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రతి మండలానికి తహసీల్దార్, డిఫ్యూటీ తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఎంఈవోల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సోమ, మంగళ వారాలు సెలవు దినాలు అయినప్పటికీ వివిధ శాఖల ఆధ్వర్యంలో సమీక్షలు, సమావేశాలు కొనసాగాయి. ప్రతి మండలంలో నిత్యం రెండు గ్రామపంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. ఐదు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమ పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా శ్రీధర్‌బాబును నియమించింది.
ఎప్పటికప్పుడు ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు
మొదటి రెండు రోజులు చిన్న గ్రామపంచాయతీల్లో ఆతర్వాత పెద్ద గ్రామ పంచాయతీల్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలో 30 గ్రామపంచాయతీలుంటే రెండు బృందాలను, అంతకుమించి గ్రామపంచాయతీలుంటే మూడు బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించిన తర్వాత గ్రామ సభను ప్రారంభించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. దరఖాస్తుల స్వీకరణ కోసం వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా స్వీకరించిన దరఖాస్తులను ఏ రోజుకారోజు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 558 గ్రామపంచాయతీలు, 4,992 వార్డులుండగా.. ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి పంచాయతీకి రూ.10వేల చొప్పున నిధులను కేటాయించింది.
ప్రత్యేకంగా దరఖాస్తుల రూపకల్పన
ప్రజల నుంచి స్వీకరించే దరఖాస్తు ఫారాలను సైతం ప్రభుత్వమే ఉచితంగా అందజేయనున్నది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులకు రూపకల్పన చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు జిరాక్స్‌లను జత చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేకుంటే దరఖాస్తులో లేదని రాయాల్సి ఉంటుంది. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. ప్రస్తుతానికి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ గృహాలు, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
తెల్ల రేషన్ కార్డుంటేనే ఆరు గ్యారెంటీలకు అర్హులంటూ ప్రచారం
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చేపట్టిన ప్రజా పాలనకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే సన్నాహక సమావేశాలను నిర్వహించిన జిల్లా యంత్రాంగం రేపటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకుగాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 31, జనవరి 1 సెలవు దినాలు మినహాయించి ఎనిమిది పనిదినాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు. పథకాలకు సంబంధించి గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు తహసీల్దార్లు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను జిల్లా కలెక్టర్ నియమించారు. ప్రతి టీంలో రెవెన్యూ అధికారితోపాటు వ్యవసాయ, విద్య, వైద్య, విద్యుత్తు, పౌరసరఫరాల శాఖల అధికారులు ఉండనున్నారు. నేడు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో దండోరా వేయించడంతోపాటు సోషల్ మీడియా ద్వారా ప్రజాపాలన దరఖాస్తులపై ప్రచారం నిర్వహించేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు దరఖాస్తులను స్వీకరించిన అనంతరం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి దశలవారీగా ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు అర్హులను ఎంపిక చేయనున్నారు.
పర్యవేక్షణకు ప్రత్యేకాధికారుల నియామకం
దరఖాస్తుల పర్యవేక్షణకు నియోజకవర్గాలు, మండలాలు, మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులను కలెక్టర్ నారాయణరెడ్డి నియమించారు. వికారాబాద్ నియోజకవర్గానికి వికారాబాద్ ఆర్డీవో, తాండూరు నియోజకవర్గానికి తాండూరు ఆర్డీవో, పరిగి నియోజకవర్గానికి డీపీవో, కొడంగల్ నియోజకవర్గానికి డీఆర్డీవోను ప్రత్యేకాధికారులుగా నియమించారు. డీసీవోను వికారాబాద్ మున్సిపాలిటీకి, డీజీడబ్ల్యూవోను పరిగి, జీఎండీఐసీని తాండూరు, అదనపు డీఆర్డీవోను కొడంగల్ మున్సిపాలిటీకి, జడ్పీ డిప్యూటీ సీఈవోను వికారాబాద్ మండలానికి, డీఎస్సీడీవోను ధారూరు, డీఎస్వోను కోట్‌పల్లి, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ను బంట్వారం, వికారాబాద్ డీఎల్పీవోను మర్పల్లి, డీఎఫ్‌వోను మోమిన్‌పేట్, డీబీసీడీవోను చౌడాపూర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీని పరిగి, డీఎండబ్ల్యూవోను పూడూరు, డీటీడీవోను దోమ, డీఆర్డీఏ ఏపీడీని కులకచర్ల, డీహెచ్ఎస్వోను తాండూరు, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీని యాలాల, జిల్లా సంక్షేమాధికారిని పెద్దేముల్, మార్కెటింగ్ ఏడీని కొడంగల్, తాండూరు పీఆర్ ఈఈని బషీరాబాద్, అదనపు డీఆర్డీవోను దౌల్తాబాద్, తాండూరు డీఎల్పీవోను బొంరాస్‌పేట, జిల్లా వ్యవసాయాధికారిని నవాబుపేట్ మండలానికి ప్రత్యేకాధికారులుగా నియమించారు.
అర్హుల ఎంపికపై అనుమానాలు
ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు అర్హుల ఎంపికకు సంబంధించి ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఆరు గ్యారెంటీల పథకాల అర్హుల ఎంపికకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ప్రజల్లో సందిగ్దం నెలకొన్నది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చిన దృష్ట్యా తెల్ల రేషన్ కార్డులేని ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. గత కొన్నేండ్లుగా కొత్త తెల్ల రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో.. చాలా మంది ముందు తెల్ల రేషన్ కార్డులను జారీ చేసిన అనంతరం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయాలని కోరుతున్నారు. నిజమైన పేదలకు ఆరు గ్యారెంటీ పథకాలు అందాలంటే తెల్ల రేషన్ కార్డులు ముందు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా తెల్ల రేషన్ కార్డును ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నట్లయితే చాలా మంది పేదలకు నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఐటీ చెల్లించే వారికి తెల్లరేషన్ కార్డు రద్దు అవుతుందనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైతులు కూడా చాలా మంది బ్యాంకు రుణాల కోసం పాన్‌కార్డులు తీసుకోవడం, ఐటీ చెల్లిస్తున్న పరిస్థితుల దృష్ట్యా ఆరు గ్యారెంటీల పథకాలకు అర్హులెవరనే దానిపై తీవ్ర అయోమయం నెలకొన్నది.