ఇబ్రహీంపట్నంరూరల్, మే 23 : రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని సర్పంచ్ల ఫోరం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఉప్పరిగూడ సర్పంచ్ బూడిద రాంరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయడాన్ని హర్షిస్తూ మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
పెండింగ్ బిల్లుల విడుదలతో గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాంరెడ్డి పేర్కొన్నారు. బిల్లుల విడుదల, కార్యదర్శుల రెగ్యులరైజ్ చేయడానికి కృషిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి, కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడు యాదయ్య ఉన్నారు.