మహేశ్వరం, జూలై 10: తెలంగాణకు బీఆర్ఎస్తోనే ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గట్టుపల్లి గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ అనితారెడ్డి, ఉపసర్పంచ్ మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నదన్నారు. పల్లెలు, పట్టణాలు మరింత అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ పాలన తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై చాలా మంది బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరిస్తున్నదన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో ముందుకెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు.