వికారాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమవుతున్నారు. ఏడాదిపాటు పంట పెట్టుబడికి ఎగనామం పెట్టడం, అనేక కొర్రీలు పెట్టి రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధర అందించకపోవడంతో రైతులు పక్క రాష్ట్రానికి ధాన్యాన్ని విక్రయించాల్సిన దుస్థితి నెలకొన్నది. జిల్లాలో 129 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా గత నెల రోజులుగా అక్కడికి ధాన్యం రాకపోవడంతో బోసిపోయాయి. వానకాలంలో 1,15,000 మె.ట ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇప్పటివరకు కేవలం 35,000 మె.ట ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించింది.
కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రభుత్వం పలు కొర్రీలు పెట్టడంతో చాలామంది రైతులు పంటను కర్ణాటకకు తరలిస్తున్నారు. అక్కడ ధాన్యం సాగు తక్కువగా ఉండడం.. మన వడ్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో వికారాబాద్ జిల్లాలో పండించిన పంటను ఆ రాష్ట్రానికి చెందిన ప్రైవేట్ వ్యాపారులు పొలాల్లోకి వచ్చి ప్రభుత్వం చెల్లిస్తున్న మద్దతు ధర రూ.2,389లకు అదనంగా రూ.500 చెల్లించి మరీ తీసుకెళ్తున్నారు. వారు ధాన్యాన్ని కొన్న వెంటనే డబ్బులను చెల్లిస్తుండటంతో జిల్లాలోని తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లోని రైతులు తమ పంటను కర్ణాటక ప్రైవేట్ వ్యాపారులకే అధికంగా విక్రయిస్తున్నారు.
జిల్లాలోని మెజార్టీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కేంద్రాలను ప్రారంభించి నెలరోజులు దాటుతున్నా ఇంకా ధాన్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉండటంతో మరో పది రోజుల్లో వాటిని మాసేయాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇంకా 50 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశముందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ధాన్యాన్ని విక్రయించే సమయంలో తేమ శాతం అంటూ రైతులను కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది ఇబ్బందిపెడుతుండగా.. విక్రయించిన పంటకు రైతులకు డబ్బులు చెల్లించడంలో సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. కేవలం రెండు, మూడు రోజుల్లోనే ధాన్యాన్ని విక్రయించిన రైతులకు చెల్లింపులు పూర్తి చేస్తామంటూ పౌరసరఫరాల అధికారులు చెబుతున్నా.. ధాన్యాన్ని విక్రయించి 15-20 రోజులైనా డబ్బులు చేతికి రావడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వానకాలంలో 35,900 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యాన్ని, 3,300 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి.. ఇప్పటివరకు రూ.43.63 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా, మరో రూ.42 కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు సన్నరకం ధాన్యానికి బోనస్ అందజేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది. గతేడాది యాసంగికి సంబంధించి ఇప్పటివరకు బోనస్‌ను అందజేయకపోవడంతో రైతులు బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటివరకు 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఇప్పటివరకు 150 మంది రైతులకు రూ.500ల చొప్పున బోనస్‌ను అందజేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.