ఇబ్రహీంపట్నం, జూన్ 5 : ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయి. ఫీజులు, డొనేషన్లు, పాఠ్యపుస్తకాలు, డ్రెస్సులు అంటూ యథేచ్ఛగా వసూలు చేస్తు న్నాయి. ఫీజుల నియంత్రణ పాటించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా పట్టించుకోవడంలేదు. విచ్చలవిడి గా లక్షల రూపాయలను ఫీజుగా తీసుకుంటున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను విక్రయించొద్దని నిబంధనలున్నా అనేక పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ వాటిని అమ్ముతున్నారు. ప్యాకేజీల రూపంలో ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు రూ.7వేలు, ఆ పై తరగతులకు రూ. 10 వేలపైనే ముక్కుపిండి దండుకుంటున్నారు. ఈ దోపిడీపై సర్వత్రా ఆరోపణలొస్తున్నా కట్టడి మాత్రం జరుగడంలేదు.
నియోజకవర్గంలోని తుర్కయాంజాల్, మన్నెగూడ, రాగన్నగూడ, బొంగ్లూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు ఐదువందల నుంచి ఆరువందల వరకు ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటిలో విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేయడమే కాకుండా రూ.ఇరవై నుంచి రూ. ముప్పైవేల వరకు ఒక్కో విద్యార్థి నుంచి డొనేషన్ల రూపంలో తీసుకుంటున్నారు. ముఖ్యంగా మన్నెగూడ, రాగన్నగూడ, తుర్కయాంజాల్‌లో కార్పొరేట్ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్నారు.
ముఖ్యంగా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది తమ పిల్లల చదువుకోసం ఇబ్రహీంపట్నం, బొంగ్లూరు, తుర్కయాంజాల్, రాగన్నగూడ, మన్నెగూడ తదితర ప్రాంతాలకు వచ్చి ఇండ్లను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు రూ.40 వేలు, ఒకటి నుంచి ఏడోతరగతి వరకు రూ.60 వేలు, ఏడు నుంచి పదోతరగతి వరకు రూ.80 వేలను వసూలు చేస్తున్నారు. దీనికి తోడు పిల్లల ట్రాన్స్‌పోర్టు పేరుతో మరో రూ. 10,000 నుంచి రూ.20,000 వరకు దండుకుంటున్నారు. డ్రెస్సులు, టైబెల్టులు, పాఠ్య,నోట్ పుస్తకాలు వీటిని అదనం. వాటితోపాటు డిజిటల్ క్లాస్‌లు, ఆటల పోటీ లు, డ్యాన్స్, సైన్స్‌ల్యాబ్, లైబ్రరీలంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అడ్డూఅదుపు లేకుండా జరుగుతున్న విద్యావ్యాపారాన్ని అరికట్టడంతో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి.
నియోజకవర్గంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఫీజుల రూపంలో రూ. లక్షకుపైగా వసూలు చేస్తున్నా.. సౌకర్యాలు మాత్రం నామమాత్రమే. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులుండరు. అద్దె భవనాల్లోనే ఒక్కోతరగతి గదిలో అరవై నుంచి ఎనభై మంది వరకు విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. సరైన ఆటస్థలాలూ ఉండడంలేదు. అనేక ప్రైవేట్ పాఠశాలలు అడ్మిషన్ల సమయంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేసి అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి సరైన అనుమతి లేకుండానే కొన్ని స్కూళ్లను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాఠశాలల్లో వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు వంటివాటిపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రైవేట్ పాఠశాలలు పెద్ద ఎత్తున ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తూ సామాన్యులను ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్నాయి. మంచి చదువు అందించేందుకు తల్లిదం డ్రులు ఒకరిని చూసి మరొకరు తమ పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ స్కూళ్లు ఫీజులను నియంత్రించాలి. డొనేషన్లూ తగ్గించాలి.
-నిట్టు జగదీశ్వర్, విద్యార్థిసంఘం నాయకుడు
ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థుల తల్లిదండ్రులతో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసుకోవాలి. ఆ బాడీలో తీర్మానం మేరకు ఫీజులను వసూలు చేయాలి. ఒకవేళ ఫీజులను పెంచితే పదిశాతానికి మించరాదు. కానీ, ప్రైవేట్ బడులు తల్లిదండ్రులతో గవర్నింగ్ బాడిని ఏర్పాటు చేయడంలేదు. ఎమ్మార్పీ రేటు కంటే ఎక్కువ ధరకు పాఠ్య, నోటుబుక్స్‌ను అమ్మరాదు. ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయాలి.
-సుశీందర్‌రావు, రంగారెడ్డి జిల్లా విద్యాధికారి