కొడంగల్ : ప్రజల జీవనోపాధిని కూల్చేయడమేనా ప్రజాపాలన అని లంబాడా హక్కుల పోరా ట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్‌నాయక్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన రోటిబండ తండాలో ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొని గాయపడ్డ రైతులను పరామర్శించి మాట్లాడారు. తండా ల్లో దాదాపుగా 80 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంటే.. 800 ఎకరాల పట్టా భూములను లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు. వ్యవసాయానికి పనికిరాని భూములు, నివాస స్థలాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలి కానీ, పచ్చటి పొలాలు, ప్రశాంతంగా జీవిస్తున్న ప్రదేశంలో కాలుష్య కారక కంపెనీలను ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
గిరిజనులు అమాయకులు, వారికేం తెలియదు.. వారిని మోసం చేయొచ్చనే భావనలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని మండిపడ్డారు. గిరిజన బిడ్డల జోలికొస్తే ఏమి జరుగుతుందో ఈ నెల 25న రోటిబండ తండాలో జరిగిన ఘటనే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. పోలీసులు గిరిజన మహిళలు, చిన్నారులు, వృద్ధులపై లాఠీచార్జి చేయడం అమానుషమన్నారు. సెంటుభూమి, ఇల్లు లేని ఐదుగురు కాంగ్రెస్ నాయకులు, ముగ్గురు అధికారులు కలిసి తీర్మానం చేస్తే ప్రభుత్వానికి భూములను అప్పగించాలా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో గిరిజనులు గోపాల్‌నాయక్, రాజూనాయక్, తండావాసులు పాల్గొన్నారు.