పల్లెల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే సర్పంచ్‌లు.. అప్పులు చేసి మరీ మురుగు కాల్వల నిర్మాణం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, వీధుల్లో సీసీ రోడ్లు తదితర పనులను చేపట్టారు. అయితే ప్రభుత్వం మారడంతో బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ పల్లెల్లో చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం దక్కడంలేదు.
దీంతో కొందరు మాజీ సర్పంచ్‌లు ఆత్మహత్యకు సైతం పాల్పడ్డారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర సర్పంచ్ల సంఘం మంగళవారం చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని మాజీ సర్పంచ్‌లను ముందస్తుగా పోలీసులు అరెస్టులు చేశారు. కొందరినీ హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పల్లెల్లో పనులు చేపట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ బిల్లులను చెల్లించాలని మాజీ సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
పరిగి : అసెంబ్లీ ముట్టడికి మంగళవారం బయలుదేరిన రాఘవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ నల్క జగన్, చిగురాల్‌పల్లి మాజీ సర్పంచ్ వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకుడు బాలయ్యలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా పెండింగ్ బిల్లులను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
మర్పల్లి : చలో అసెంబ్లీకి తరలిన మాజీ సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి మర్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాచయ్య, యూత్ అధ్యక్షుడు మధుకర్, పీర్యానాయక్ తదితరులు ఉన్నారు.
పూడూరు : అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్తున్న మండలంలోని మాజీ సర్పంచ్‌లు బుచ్చన్న, భాస్కర్‌రెడ్డి, వీరన్న, సత్యనారాయణ, వినోద్, ఖదీర్, సదానందంగౌడ్లను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో అప్పులు చేసి పనులు చేయించామని, తమకు రావాల్సిన డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దోమ : దోమ సర్పంచ్ల సంఘం మాజీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు వెళ్లవద్దని ఏఎస్ఐ చారి ఆయనకు సూచించారు. నిరసన తెలిపేందుకు వెళ్లనీయకుండా అడ్డుకోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు. సర్పంచ్‌లంతా పల్లెల్లో పనులు చేపట్టి అప్పులపాలయ్యారని వాపోయారు.