వికారాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి-బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్ మధ్య విభేదాలకు ఫుల్స్టాప్ పడింది. రాజశేఖర్ జిల్లా అధ్య క్ష పదవికి రాజీనామా చేయగా శుక్రవారం..దానిని ఆమోదిస్తూ ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం లేఖను విడుదల చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆదేశాల మేరకు మూడు రోజుల కిందటే రాజశేఖర్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా..మొదట జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయ్యేవరకు అతడ్ని కొనసాగిద్దామనుకున్నా పలువురు నాయకుల ఒత్తిడితో రిజైన్‌ను ఆమోదించినట్లు సమాచారం. కాగా, కొత్త అధ్యక్షుడిని నియమించకుం డా తాత్కాలికంగా జిల్లా కన్వీనర్‌గా ప్రహ్లాద్‌రావును ఆ పార్టీ నియమించింది.
బీజేపీ జిల్లా అధ్యక్షుడిని మార్చడంతో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. గత ఐదారు నెలలుగా ఎంపీ కొండా, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ మధ్య విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. ఎంపీ కొండా పలుమార్లు జిల్లా అధ్యక్షుడిపై బహిరంగంగానే రాజకీయాలకు పనికారాడంటూ కామెంట్లు చేయడం, మీడియా సమావేశాలకు రానివ్వకపోవడం వంటివి జరిగాయి. గద్వాల జిల్లాకు చెందిన వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా ఎట్టిపరిస్థితుల్లోనూ నియమించొద్దని పార్టీ అధిష్ఠానానికి జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఆశించిన వారంతా తెగేసి చెప్పినా చేవెళ్ల ఎంపీ కొండా పట్టుబట్టి మరీ రాజశేఖర్‌కే ఆ పదవి ఇప్పించారు. వింతేమిటంటే రాజశేఖర్ నియామకంలో కీలకం గా వ్యవహరించిన ఎంపీ విశ్వేశ్వర్రెడ్డినే ప్రస్తుతం అతడ్ని తప్పించేలా పావులు కదపడం గమనార్హం. జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎంపీ కొండా చెప్పిన మాటలను అమలు చేయకపోవడం, ఆయన వర్గాన్ని పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగినట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నది. జిల్లా అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేయడంలో సీనియర్లను పట్టించుకోకపోవడంతోపాటు కొండా వర్గాన్ని కూడా పక్కన పెట్టడంతోనే రాజశేఖర్ అధ్యక్ష పదవిని కోల్పోవాల్సి వచ్చిందని సమాచారం.
బీజేపీ జిల్లా అధ్యక్షుడి రాజీనామా తో ఆ పార్టీ కొత్త జిల్లా అధ్యక్షుడు ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఎంపీ కొండా జిల్లా అధ్యక్షుడి నియామకంలోనూ అనుకున్న వారికే ఇప్పించే లా ముందుకెళ్తున్నట్లు తెలిసింది. కన్వీనర్‌గా నియమితులైన ప్రహ్లాద్‌రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వరకు కొనసాగనున్నట్లు సమాచారం. జిల్లా అధ్యక్ష పదవి కోసం తాండూరు నియోజకవర్గానికి చెందిన ఉప్పరి రమేశ్, మిట్ట పరమేశ్వర్‌రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రమేశ్, పరమేశ్వర్‌రెడ్డి కొండా వర్గం నాయకులు కావడంతో వీరిద్దరిలో ఒకరికి అధ్యక్ష పదవిని కట్టబెట్టే అవకాశాలున్నాయి. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి ఆ పదవి ఇవ్వాలని ఆలోచిస్తే రమేశ్‌కు అధ్యక్ష పదవి దక్కవచ్చు.
వికారాబాద్ జిల్లా బీజేపీలో చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవిలో తాను అనుకున్న వ్యక్తి ని నియమించడం మొదలు, అన్ని తాను అనుకున్నట్లు జరగాలనేలా కొండా వ్యవహరిస్తున్నట్లు ప్రచారమూ ఉన్నది. తన మాట కాదంటే పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే స్థానికేతరుడైన రాజశేఖర్‌కు అధిష్టానాన్ని ఒప్పించి మరీ జిల్లా అధ్యక్ష పీఠాన్ని అప్పగించి.. ఇప్పుడు తన మాట వినడంలేదని పక్కన పెట్టించడంపై సొంత పార్టీ నేతల నుం చి ఎంపీ తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతుంది.