హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షాలతో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతోప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వానొస్తే చాలు వెంటనే కరెంటు కట్ చేస్తున్నారు. రాత్రిపూట కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు కరెంటు తీగలు వేలాడుతుండటం వలన వర్షానికి ముందువచ్చే ఈదురు గాలులకు అల్లుకుపోతున్నాయి. దీంతో కరెంటు ట్రిప్ అవుతుండటంతో కొన్ని సందర్భాల్లో రాత్రంతా విద్యుత్ ఉండని పరిస్థితి కూడా ఏర్పడుతున్నది.
వేలాడుతున్న విద్యుత్ తీగలు, రక్షణలేని ట్రాన్స్ఫార్మర్లతో విద్యుత్ సమస్య తరుచుగా తలెత్తుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. మరోవైపు అనధికారికంగా గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారు. సరూర్‌నగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, శంకర్పల్లి, మొయినాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షాలు తగ్గినప్పటికీ కరెంటు రాని పరిస్థితి ఏర్పడుతున్నది.
– రంగారెడ్డి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)
జిల్లావ్యాప్తంగా సరూర్‌నగర్, సైబర్‌సిటీ, రాజేంద్రనగర్ సర్కిళ్ల పరిధిలో శివారు ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో రాజేంద్రనగర్, కందుకూరు., సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలో చంపాపేట్, ఇబ్రహీంపట్నం., సైబర్‌సిటీ సర్కిల్ పరిధిలో గచ్చిబౌలి, చేవెళ్ల తదితర ప్రాంతాలున్నాయి. ఈ డివిజన్ల పరిధిలో గృహ వినియోగానికి సంబంధించి 13,22,646 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ కనెక్షన్లతో విద్యుత్ శాఖకు భారీ ఆదాయం వస్తున్నా.. వేలాడుతున్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లకు ఎలాంటి రక్షణ కల్పించడంలేదు. గాలి దుమారం వచ్చినప్పుడు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. ముందు జాగ్రత్తగా వేలాడుతున్న విద్యుత్ తీగలను మరమ్మతు చేయడంపై అధికారులు చొరవ చూపడంలేదనే ఆరోపణలొస్తున్నాయి.
జిల్లావ్యాప్తంగా సుమారు 40వేలకు పైగా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్లలో ఎక్కువ శాతం రక్షణ లేకుండా ఉన్నాయి. వర్షాలు, ఈదురుగాలులకు తరచుగా ట్రాన్స్ఫార్మర్ల ఫీజులు ఎగిరిపోతున్నాయి. దీనికితోడు సిబ్బంది గంటలు గడిచినా మరమ్మతులు చేయకపోవడంతో సరఫరాలో అంతరాయానికి కారణమవుతున్నది. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లపై అదనపు కనెక్షన్లు ఇస్తుండటంతో ట్రాన్స్ఫార్మర్లు తరుచుగా కాలిపోతున్నాయి. ఈ కారణంతో కూడా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. ఇటీవలి కాలంలో రాత్రిపూట రోజుల తరబడి కరెంటు రాని పరిస్థితి నెలకొన్నది. కొన్ని సందర్భాల్లో లో వోల్టేజీ సమస్య ఏర్పడి ఇంట్లోని విలువైన ఎలక్ట్రిక్ పరికరాలు కాలిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేన్నారు.
రాత్రి సమయాల్లో విద్యుత్ కోతలతో వీధి దీపాలు కూడా వెలగని పరిస్థితి నెలకొన్నది. శివారు ప్రాంతాల్లోని వివిధ కాలనీల్లో సుమారు 20వేలకు పైగా విద్యుత్ దీపాలున్నాయి. అనధికార కరెంటు కోతలతో తాము ఎంతో ఇబ్బందులకు గురవుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని, వర్షాకాలంలో గంటల తరబడి కరెంటు సరఫరా నిలిపివేయటం, అలాగే.. ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.