హైదరాబాద్ సిటీబ్యూరో/సంగారెడ్డి, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారు గ్రామాల విలీన ప్రక్రియ అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలను కలవరపెడుతున్నది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసినవారే కాకుండా ఈసారి చాలామంది వార్డు మెంబర్లుగా, సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించుకుని కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. కానీ విలీనం వారి కలలను కల్లలు చేసింది. అన్ని వార్డుల్లో కార్యకర్తలు, నాయకులు వారి పార్టీల కోసం కష్టపడుతూ, కోరుకున్న పదవుల్లో గెలవడానికి సన్నద్ధమయ్యారు. ప్రధానంగా పదేండ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. విలీన ప్రక్రియ వారి ఆశలపై నీళ్లు చల్లింది.
సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం ఫిబ్రవరి 1తోనే ముగిసింది. ఈ నేపథ్యంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసినప్పటికీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల పదవులను ఆశించిన నేతల కలలు కల్లలయ్యాయి. అంతేకాదు ఆయా పంచాయతీలకు చెందిన నేతలు జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ పదవులకు పోటీపడే అవకాశాన్ని కోల్పోయారు. వీటితోపాటు పీఏసీఎస్ సభ్యులు, చైర్మన్, రైతు సమన్వయ సమితి, మండల అధ్యక్షుడి పదవులనూ రాజకీయనేతలు కోల్పోతారు. జిల్లాస్థాయిలో ఉండే జడ్పీ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ పదవులకు విలీన గ్రామనేతలు పోటీ పడే అవకాశాలు కూడా లేవు. దీంతో నేతల భవిష్యత్ అంధకారంలో పడింది.
ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాలన్నీ మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. జనవరిలో మున్సిపాలిటీల పాలన పూర్తవుతుంది. మరో ఏడాది పాటు ప్రత్యేక అధికారుల పాలనతో నడిపించి గ్రేటర్ పాలకవర్గం కాలపరిమితి ముగిసిన తర్వాత కార్పొరేషన్లో కలిపేసి ఎన్నికలకు సిద్ధం అవుతారన్న ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం 150 డివిజన్లు కలిపి కోటి జనాభాతో జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారు. విలీన గ్రామాలకు సంబంధించి ఏడు కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో 60 లక్షల జనాభా నివాసం ఉంటున్నది. వీటన్నింటినీ కలిపి హైదరాబాద్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటైతే మొత్తం జనాభా 1.8 నుంచి 2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రభుత్వ నిర్ణయం మేరకు సిటీ కార్పొరేషన్ ఏర్పాటైతే కౌన్సిలర్లు, చైర్మన్లు, డైరెక్టర్ల పదవులన్నీ కనుమరుగవుతాయి. వాటి స్థానంలో కార్పొరేటర్లు, మేయర్లు పాలనలోకి వస్తారు. దీంతో నేతల తలరాతలు మారనున్నాయి. ప్రస్తుతం 1200 ఓటర్లతో ఒక మున్సిపల్ వార్డ్డు, 300 ఓటర్లతో పంచాయతీ వార్డులు ఉండగా కార్పొరేషన్ ఏర్పాటైతే ఒక్కో డివిజన్ పరిధిలో సుమారు 30వేల నుంచి 40వేల మంది ఓటర్లు ఉండే అవకాశముంది.
ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ విలీనప్రక్రియలో భాగంగా పటాన్చెరు సెగ్మెంట్లోని పదకొండు గ్రామాలను తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీల్లో కలిపింది. పటాన్చెరు, అమీన్పూర్ మండలాల పరిధిలో దాదాపు 200 మంది లీడర్లు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లారు. గ్రామాల విలీన ప్రక్రియ ఈ నేతల ఆశలపై నీళ్లుచల్లింది. మేడ్చల్ జిల్లాలో 28 గ్రామాలు విలీనమైతే.. అందులో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డుమెంబర్స్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ మెంబర్లు కలిపి మొత్తం 270 పదవులు ఉండేవి. ఇప్పుడు మున్సిపాలిటీల్లో విలీనం తర్వాత విలీన గ్రామాలకు 130 కౌన్సిలర్లు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. అంటే కనీసం వంద పదవులు తగ్గిపోతాయి. ఇవి కూడా ప్రతిపాదిత సంఖ్య. కానీ ఆ తర్వాత జీహెచ్ఎంసీలో విలీనమైతే కార్పొరేటర్లుగా మారి ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశముంటుంది. దీంతో పదవులు మరిన్ని తగ్గిపోతాయి. మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో విలీనమైన గ్రామాలన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తే ఇప్పటివరకు ఎవరైతే చోటానేతలుగా ప్రజలతో దగ్గరగా ఉన్నారో వారంతా డమ్మీలుగా మారాల్సిందే. పది మందిలో ఎవరో ఒకరికీ మాత్రమే అవకాశం దక్కనున్నది.