నందిగామ, ఏప్రిల్ 18 : పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016లో రాష్ట్రవ్యాప్తంగా నూతన మండలాలను ఏర్పాటు చేసింది. అందులో నందిగామ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్ స్టేషన్ భవనం లేక నందిగామ గ్రామపంచాయతీ కార్యాలయంలోనే పోలీసు అధికారులు పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ, పోలీస్‌స్టేషన్ ఒకే భవనంలో ఉండటంతో ఇటు పోలీసులు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
నందిగామ పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.కోటి విరాళం ఇచ్చిన నాట్కో పరిశ్రమ
పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ప్రభుత్వం నందిగామ గ్రామంలో ఎన్‌హెచ్-7 పాత జాతీయ రహదారికి పక్కన 33 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించింది. పోలీస్ స్టేషన్ భవనం నిర్మించాలనే పోలీసు అధికారుల వినతి మేరకు నందిగామ మండలం మేకగూడ గ్రామంలోని నాట్కో పరిశ్రమ యాజమాన్యం ముందుకు వచ్చింది. నాట్కో ట్రస్ట్ ద్వారా రూ.70లక్షల విరాళం ప్రకటించడంతో అప్పటి సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రానురాను నిర్మాణ వ్యయం పెరగడంతో నాట్కో ట్రస్ట్ ద్వారా అదనంగా మరో రూ.30లక్షలు విరాళం అందించారు. దీంతో మొత్తం రూ.కోటి వ్యయంతో నందిగామ పోలీస్ స్టేషన్ భవనం సకల సౌకర్యాలతో అన్ని రకాల అత్యాధునిక హంగులతో చకచకా పనులు పూర్తి చేశారు. సీఐ, ఎస్ఐ, ఏఎస్ఐ, కంప్యూటర్, రికార్డులు, రిసెస్షన్, విశ్రాంతి గదులు, వెయిటింగ్ గదులు, నిందితులను ఉంచేందుకు ప్రత్యేక లాకప్ గదులు, వాహనాల పార్కింగ్ స్థలం ఇలా అన్ని రకాల వసతులతో నందిగామ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం పూర్తయింది. పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను నందిగామ సీఐ రామయ్య నిత్యం పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎంతగానో కృషి చేశారు.
ప్రారంభానికి సిద్ధంగా చేవెళ్ల పోలీస్‌స్టేషన్
చేవెళ్లలో 50 సంవత్సరాల క్రితం నిర్మించిన పోలీసులు స్టేషన్ శిథిలావస్థకు చేరింది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కోటి రూపాయలకు పైగా వెచ్చించి సకల హంగులతో నూతన భవన నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు, నలుగురు ఏఎస్ఐలు, 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ భవనంలో సీఐ, ఏస్సై రైటర్లకు గదులతోపాటు కౌన్సిలింగ్ విశ్రాంతి గదులు నిర్మించారు. అవసరమైన ఫర్నిచర్‌ను కూడా ఏర్పాటు చేశారు. పోలీస్‌స్టేషన్ చుట్టూ ప్రహరీ, ముందు పార్కింగ్ సౌకర్యం, రెండు వరుసలా రోడ్డు ఏర్పాటు చేయడంతోపాటు ఇరువైపులా మొక్కలు నాటారు. దీంతో చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
నేడు పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్న మంత్రులు
బుధవారం హోం మంత్రి మహమూద్‌అలీ, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కాలె యాదయ్య సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి హాజరై నందిగామ నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నట్లు సీఐ రామయ్య తెలిపారు. చేవెళ్లలో పోలీస్‌స్టేషన్‌ను మంత్రులతో పాటు ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించనున్నట్లు చేవెళ్ల ఏసీపీ ప్రభాకర్ తెలిపారు.