హైదరాబాద్: రావిర్యాల(Raviriyala) ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఏటీఎంలో గ్యాస్ కట్టర్ వాడి చోరీ చేసింది పాత నేరస్థులుగా గుర్తించారు. హరియాణాకు చెందిన ముఠానే ఈ ఘరానా మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 2019లోనూ ఆదిభట్లలో ఇదే తరహాలో ఏటీఎం చేరీ చేశారని పోలీసులు తెలిపారు. దోపిడీకి పాల్పడిన తర్వాత నిందితులు ముంబై వెళ్లినట్లు భావిస్తున్నారు.
కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. మండలంలోని రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంను (ATM Robbery) పగలగొట్టిన దుండగులు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున కారులో వచ్చిన దుండగులు.. ఏటీఎంలోని సీసీ కెమెరాలు, సైరన్ ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్లతో ఏటీఎం మెషిన్‌ను బద్దలు కొట్టారు. డబ్బును తీసుకొని పారిపోయారు. కేవలం నాలుగు నిమిషాల్లోనే పనిపూర్తిచేసి డబ్బు ఎత్తుకెళ్లారు.
ఘటనా స్థలానికి చేరుకున్న మహేశ్వరం డీసీపీ సునితా రెడ్డి, ఏసీపీ రాజు ఏటీఎంను పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి దొంగల కోసం గాలిస్తున్నారు. కాగా, రెండు రోజుల క్రితం ఏటీఎంలో రూ.30 లక్షలు పెట్టినట్లు బ్యాంక్ మేనేజర్ వెల్లడించారు.