కలకలం రేపిన మొయినాబాద్ యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు పాతబస్తీకి చెందిన యువతిగా గుర్తించారు. ఆమెది హత్య కాదు..ఆత్మహత్యగా తేల్చారు. ఈనెల 8న మొయినాబాద్, బాకారం గ్రామం, డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం కాలిపోతున్నట్లు 100 నంబర్‌కు కాల్ వచ్చింది.
పోలీసులు అక్కడికి చేరుకునే సరికే మృతదేహం పూర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలిలో సిమ్ లేని సెల్‌ఫోన్ కనిపించింది. క్లూస్‌టీమ్, జాగిలాలతో పరిసరాల్లో ఆధారాలను సేకరించారు. తొలుత ఆ యువతిని ఎవరో హత్యచేసి కాల్చివేసినట్లు అనుమానించిన పోలీసులు.. మృతురాలిని గుర్తించే క్రమంలో దర్యాప్తు ప్రారంభించారు. మొయినాబాద్ పోలీసులతో పాటు రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాలు, టవర్ లొకేషన్, సిమ్‌కార్డ్ ట్రాకింగ్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 200 మిస్సింగ్ కేసులను విశ్లేషించారు.
– సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ):
పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 8న మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల సమయంలో ఒక ఆటో యెంకపల్లి నుంచి బాకారం వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ ఫుటేజీ ఆధారంగా ఆటో డ్రైవర్‌ను రాజేంద్రనగర్‌కు చెందిన సయీద్ వాసిమ్గా గుర్తించారు. అతడిని విచారించగా ఆ రోజు ఉదయం 11.30 గంటల సమయంలో ఓ యువతి మల్లేపల్లిలో తన ఆటో ఎక్కిందని, డ్రీమ్ వ్యాలీకి వెళ్లాలని రూ.1100కు మాట్లాడినట్లు వెల్లడించాడు.
తొలుత మురాద్‌నగర్‌లోని తన స్నేహితుల ఇంటికి వెళ్లాక.. హుమాయున్‌నగర్‌లోని రాయల్ కాలనీలో ఉన్న మరో స్నేహితురాలి ఇంటికి వెళ్లిందన్నాడు. 15 నిమిషాల తరువాత వచ్చిన యువతి ఐదు లీటర్ల డబ్బా ఉన్న బ్యాగ్‌తో వచ్చి, తిరిగి ఆటోలో ఎక్కి మొయినాబాద్ డ్రీమ్ వ్యాలీ వెళ్లినట్లు వెల్లడించారు. అక్కడ ఓ ఫామ్‌హౌస్ వద్ద ఆటో దిగిన ఆ యువతి.. తనకు ఆటో చార్జ్ రూ.1100 ఇచ్చినట్లు డ్రైవర్ తమ విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు. ఆ తరువాత మధ్యాహ్నం 1.53
స్నేహితుడైన రాహిల్‌కు ఫోన్ చేసి, ఆ తరువాత తన మొబైల్‌ను స్విచ్ఛాఫ్ చేసినట్లు దర్యాప్తులో నిర్ధారించారు. ఈ ఫోన్ కాల్ ఆధారంగా రాహిల్‌ను విచారించగా సదరు యువతి పాతబస్తీలోని మల్లేపల్లికి చెందిన తహసీన్ బేగంగా గుర్తించినట్లు తెలిపారు. తహ్సీమ్ బేగం తన క్లాస్ మేట్ ఒక స్నేహితురాలితో చాలా సన్నిహితంగా ఉండేది.
ఈ క్రమంలో ఇటీవల ఇరువురి మధ్య తలెత్తిన మనస్పర్థలతో కొన్ని రోజులుగా ఇరువురు దూరంగా ఉంటున్నారని, అంతేకాకుండా వీరి సన్నిహిత్యంపై కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పడంతో తహసీన్ బేగం డిప్రెషన్‌కు గురై, గతంలో ఓ సారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వివరించారు. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడికి లోనైన తహసీన్ బేగం తన స్నేహితురాలి ఎడబాటును తట్టుకోలేక ఆత్మాహుతికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.