రంగారెడ్డి, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో రైతు ఉద్యమాలపై పోలీసుల నిర్బంధం కొనసాగుతున్నది. పోలీసులు ఆంక్షలు విధించి రైతుల హక్కులను కాలరాస్తున్నారు. జిల్లాలో ఓవైపు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు భూసేకరణ, మరోవైపు ఫార్మా విలేజ్ కోసం బలవంతంగా పట్టా భూములు తీసుకున్నారని, తమ భూములను తమకు తెలియకుండానే నిషేధిత జాబితాలో చేర్చారంటూ కొంతకాలంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆందోళనపై పోలీసుల నిర్బంధంతో తొక్కిపెట్టి రైతుల భూములను యథేచ్చగా కొల్లగొడుతున్నారు. జిల్లాలోని కందుకూరు, యాచారం మండలాల్లో గతంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను సేకరించింది.
కొన్ని పట్టాభూములు కూడా తీసుకోవాలని నిర్ణయించగా, రైతులు నిరాకరించి కోర్టును ఆశ్రయించారు. దీంతో గత ప్రభుత్వం పట్టా భూములు తీసుకునే విషయంలో వెనుకడుగు వేసింది. ఈ సమయంలోనే సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే రైతుల పట్టా భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించి ఆ భూములను రైతులకే ఇస్తామని కాంగ్రెస్ నాయకులు రైతులకు హామీ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ రైతుల భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించకపోగా, వారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.
దీంతో యాచారం మండలంలోని మేడిపల్లి, తాటిపర్తి, నానక్‌నగర్, కుర్మిద్ద గ్రామాల్లో సుమారు రెండు వేల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నది. ఈ భూములకు సంబంధించిన రైతులు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీని ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి ఆందోళనలపై నిషేధం విధించింది. అనుమతులు లేకుండా ఆందోళనలు చేస్తే కేసులు పెడతామని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని, రైతుల హక్కును కాలరాయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో శనివారం ఫార్మా భూ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నానక్‌నగర్ గ్రామంలో ఫార్మాకు వ్యతిరేకంగా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనుమతులు లేకుండా కార్యక్రమాన్ని చేపట్టవద్దంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు, ఫార్మా భూ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకపోవటంపై పలువురు రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
జిల్లాలో కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి ఫోర్త్‌సిటీ మీదుగా ఆకుతోటపల్లి వరకు ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం ప్రభుత్వం భూ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. రోడ్డు కోసం తమ భూములను తీసుకోవద్దంటూ ఆయా గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినప్పటికి భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. 41కిలోమీటర్ల రోడ్డు కోసం రైతుల నుంచి సుమారు వెయ్యి ఎకరాలను సేకరించింది. 330 అడుగుల వెడల్పుతో చేపట్టే ఈ రోడ్డుకు తమ పట్టా భూములను బలవంతంగా తీసుకోవద్దంటూ సర్వేకు అడుగడుగునా అడ్డు తగిలారు. ఈ సందర్భంగా పోలీసులు సర్వే నిర్వహించే గ్రామాల్లో పెద్ద ఎత్తున మోహరించి రైతులను ఎక్కడికక్కడ అడ్డుకుని బలవంతంగా సర్వే నిర్వహించి హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. తమ పట్టా భూములను నమ్ముకుని ఎన్నో ఏండ్లుగా జీవిస్తున్నామని, తమను రోడ్డుపాలు చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.