ప్రభుత్వం గోశాలకు తీసుకోవాలని భావించిన ఎన్కేపల్లి భూముల వ్యవహారం రోజురోజుకూ ఉద్రిక్తతకు దారి తీస్తున్నది. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన పరిహారాన్ని భూబాధితులు ఒప్పుకోకపోవడం.. వారు అడిగిన పరిహారాన్ని సర్కార్ ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో భూములను ఇచ్చేది లేదని అన్నదాతలు తెగేసి చెబుతున్నారు. దీంతో బలవంతంగానైనా భూములను తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతో సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్యతో అధికారులు భూమి పూజ చేయించారు. తమకు చెప్పకుండా, పరిహారాన్ని నిర్ణయించకుండా తమ భూముల్లో ఎలా భూమి పూజ చేస్తారని అన్నదాతలు ఒక్కసారిగా ఆగ్రహం చెందడంతో పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని భావించిన అధికారులు, పోలీసులు ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించేశారు.
– మొయినాబాద్, జూలై 7
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి, ఎన్కేపల్లి గ్రామ రెవెన్యూలో గల సర్వేనం.180లోని 99.14 ఎకరాల భూములను ప్రభుత్వం గోశాల నిర్మాణానికి కేటాయించిన విషయం తెలిసిందే. గోశాల నిర్మాణానికి భూములను త్వరగా సేకరించాలని రెవెన్యూ అధికారులను సర్కారు ఆదేశించడంతో శనివారం వారు పోలీస్ పహారాలో భూములను సర్వే చేశారు. ప్రభుత్వం ఎకరానికి 300 గజాల స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని.. మీరు ఒప్పుకోకపోతే సోమవారం నుంచి పనులను ప్రారంభిస్తారని రెవెన్యూ అధికారులు రైతులకు అల్టిమేటం జారీ చేశారు. కాగా, ఆదివారం రైతులకు తహసీల్దార్ గౌతమ్‌కుమార్ ఫోన్ చేసి సోమవారం ఎమ్మెల్యే యాదయ్య మీతో మాట్లాడుతారని సోమవారం ఉదయం 8 గంటల వరకు భూముల వద్దకు రావాలని సూచించారు.
ఎమ్మెల్యేతో ఎకరానికి 500 గజాల స్థలం ఇవ్వాలని కోరుదామని రైతులందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. అయితే, ఎమ్మెల్యే రైతులకు చెప్పిన సమయం కంటే ముందే (7:30 గంటలకు) భూముల వద్దకు వచ్చారు. అప్పటికీ రైతులు రాకపోయేసరికి చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్ ఎమ్మెల్యేతో భూమి పూజను ప్రారంభించారు. ఎమ్మెల్యే భూమి పూజ చేస్తున్నారని సమాచారం అందుకున్న రైతులు తమకు చెప్పకుండా, పరిహారాన్ని నిర్ణయించకుండా తమ భూముల్లో ఎలా భూమి పూజ చేస్తారని ఆగ్రహంతో అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని భావించి.. వారు రక్షణగా ఉండి ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించేశారు. మీరు రాకపోయేసరికి ఎమ్మెల్యేతో భూమి పూజ చేయించినట్లు అధికారులు రైతులకు చెప్పారు. దీంతో ఆగ్రహం చెందిన అన్నదాతలు ఆందోళన చేపట్టి ముఖ్యమంత్రి డౌన్‌డౌన్.. ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రాణాలు పోయినా.. భూములిచ్చేది లేదని తేల్చి చెప్పారు.
రైతులు ఒకవైపు ఆందోళన చేస్తుండగా.. మరోవైపు జేసీబీతో భూమిలోని చెట్లను అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. ఎందుకు జేసీబీని పొలాల్లోకి పంపుతున్నారని రెవెన్యూ అధికారులు, పోలీసులను ప్రశ్నించగా.. ప్రభుత్వ భూమిలో పక్క భూమి వారు రూం కట్టారని.. దానిని తొలగించేందుకు వెళ్తున్నదని చెప్పి రైతుల దృష్టిని మళ్లించారు. రైతులు గమనించి చెట్లను తొలగిస్తున్న జేసీబీని అడ్డుకుని అక్కడి నుంచి పంపించే క్రమంలో కొందరు రైతులు కర్రలతో జేసీబీని కొట్టారు. దీంతో పోలీసులు కోపోద్రిక్తులై రైతులను తోసేయడంతో రైతులకు వారి మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొన్నది. ఈ క్రమంలో రాము అనే కానిస్టేబుల్ బీఆర్ఎస్ నాయకుడిపై లాఠీతో కొట్టడంతో రైతులు మరింత ఆగ్రహానికి గురై కర్రలతో పోలీసుల వెంటపడి అక్కడ నుంచి తరిమేశారు. ఎకరానికి 500 గజాల స్థలమిస్తే తమ భూములను గోశాలకు ఇవ్వాలని భావించామని.. మాట్లాడేందుకు రమ్మని చెప్పి.. తమకు తెలియకుండానే ఎమ్మెల్యేతో భూ మి పూజ చేయించడంతోపాటు.. పోలీసులతో దాడులు చేయించడం తమను తీవ్రంగా కలచివేసిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయినా సరే గోశాలకు భూములు ఇచ్చేది లేదని వారు స్పష్టం చేశారు.