చేవెళ్ల రూరల్, మార్చి 25 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత 10 సంవత్సరాల పాలనలో గ్రామాల్లో పచ్చదనం ఫరిడవిల్లేది. కాని ఇప్పుడు అందుకు భిన్నంగా గ్రామాల్లో పచ్చదనం కరువైంది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలకు నీరు అందక నేడు ఎండిపోయి కనిపిస్తున్నాయి.
70 శాతం దగ్ధమైన పల్లె ప్రకృతి వనం
చేవెళ్ల మండల పరిధి హస్తేపూర్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో 70 శాతం మొక్కలు కాలి బూడిదయ్యాయి. అధికారుల పర్యవేక్షణ కరువైందని, పట్టించుకునే నాథుడే లేదని ప్రజలు వాపోతున్నారు.
పచ్చదనంపై పట్టింపేది..?
మొయినాబాద్ : గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నతాశయంతో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపించినా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచారు. గ్రామగ్రామాన లక్షల మొక్కలను నాటి వాటిని పంచాయతీ సిబ్బందితో కంటికి రెప్పలా కాపాడేలా సంరక్షించారు. చెట్లకు నీళ్లు పెట్టి ఏపుగా పెంచారు. కాని ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చదనాన్ని పట్టించుకోవడంలేదు. మొయినాబాద్ మున్సిపాలిటీలో ఉన్న గ్రామాలతోపాటు మొయినాబాద్ మండలంలో ఉన్న గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలకు నీళ్లు అందించకపోవడంతో ఎండుతున్నాయి. మున్సిపల్ అధికారులు కాని, పంచాయతీ శాఖ అధికారులు కాని పల్లె ప్రకృతి వనాల వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు.
కాంగ్రెస్‌ది బాధ్యతారాహిత్యం
దోమ : దోమ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం ఎండిపోయి దర్శనమిస్తున్నది. మొక్కలు పెంచడానికి, పల్లె ప్రకృతి వనాల నిర్వహణకు నాటి ప్రభుత్వం పంచాయతీలకు ట్రాక్టర్‌తో కూడిన వాటర్ ట్యాంకర్లను సమకూర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగడంతో పంచాయతీ కార్యదర్శులుగాని సంబంధిత అధికారులు పల్లె ప్రకృతి వనాల వైపు కన్నెత్తి చూడటంలేదు. ఎండాకాలం వచ్చి దాదాపుగా రెండు నెలలు గడిచినా ప్రకృతి వనాలకు ఏ ఒక్కరోజూ నీరు పట్టక పోవడం శోచనీయం. పల్లె ప్రకృతి వనాలను కాపాడే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.