వికారాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): గనులను ఈ-వేలానికి ఇంకా మోక్షం లభించడంలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న లీజు విధానానికి స్వస్తి పలికి.. వేలం వేసే విధానాన్ని తీసుకువచ్చేందుకు జిల్లా గనుల శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేసినా.. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో పెండింగ్లో పడింది. ఇప్పటికే రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా గనుల ఈ-వేలం విధానాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని వికారాబాద్ జిల్లాలోనూ అమలు చేసేందుకు అధికారులు గనులున్న ప్రాంతాలకు సంబంధించిన డీజీపీఎస్ మ్యాపులను సిద్ధం చేయడంతోపాటు రెవెన్యూ శాఖ నుంచి ఎన్వోసీలను కూడా సేకరించి ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
లీజుకిచ్చే పద్ధతితో ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం జరుగుతుంది. దీన్ని నివారించేందుకు ఈ-వేలం విధానంతో గనుల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసేలా ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ఆరు నెలల క్రితమే ప్రతిపాదనలను అందజేసింది. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో గనుల తవ్వకాలు లీజు విధానంలోనే కొనసాగుతున్నది.

మైనింగ్ వ్యాపారులు.. ఒకచోట లీజుకు తీసుకొని.. పలు ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా లీజు గడువు పూర్తయినా తవ్వకాలు జరుపుతూనే ఉండడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతున్నది. రెండేండ్లుగా జిల్లావ్యాప్తంగా వెయ్యికిపైగా దరఖాస్తులురాగా.. అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ఈ-వేలం విధానంతో నిర్ణీత సమయానికి గనుల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తారు కాబట్టి వాటిని పెండింగ్లోనే ఉంచి.. లీజు విధానాన్ని అమలు చేస్తున్నారు.
జిల్లాలో అనుమతులు పొందకుండానే మైనింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. తాండూరు నియోజకవర్గంలో నాపరాయి, సుద్ధ గనులు, ఎర్రమట్టిని తవ్వి తరలిస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు, మైన్స్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు అందితే తుతూమంత్రంగా గనులకు వెళ్లి అక్కడున్న చిన్నచిన్న యంత్రాలను సీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. సర్వే నంబరు పేరు ఒకటి ఉంటే, మరో చోట కనెక్షన్ తీసుకొని తవ్వకాలు జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ, విద్యుత్, మైన్స్, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేస్తేగానీ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడేలా లేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరం గనుల లీజుల ద్వారా రూ.115.04 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానకు చేరింది. గతేడాది రూ.113.46 కోట్ల రెవెన్యూ వస్తుందని అధికారులు అంచనా వేయగా.. ఏకంగా అంతకుమించి ఆదాయం లభించింది. ఇందులో పెద్ద తరహా గనుల లీజుతో రూ.27.08 కోట్లు, చిన్నతరహా గనుల లీజుతో రూ.87.95 కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్లో రూ.10.68 కోట్లురాగా, మేలో రూ.10.96 కోట్లు, జూన్లో రూ.12.76 కోట్లు, జూలైలో రూ.7.70 కోట్లు, ఆగస్టులో 9.30 కోట్లు, సెప్టెంబర్లో రూ.7.51 కోట్లు, అక్టోబర్లో రూ.8.49 కోట్లు, నవంబర్లో రూ.7.30 కోట్లు, డిసెంబర్లో రూ.8.73 కోట్లు, జనవరిలో రూ.8.93 కోట్లు, ఫిబ్రవరిలో రూ.15.47 కోట్లు, మార్చిలో రూ.7.18 కోట్ల ఆదాయం మైనింగ్ శాఖకు వచ్చింది.
జిల్లాలో ఎర్రమట్టి, సుద్ధ గనులు, నాపరాయి, పలుగురాయి, సెల్డ్స్పార్, కంకర, గ్రానైట్ గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. పెద్దేముల్, మర్పల్లి, వికారాబాద్, పరిగి మండలాల్లో 610 హెక్టార్ల విస్తీర్ణంలో 40 ఎర్రమట్టి గనులున్నాయి. తాండూరు మండలంలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో 160 నాపరాయి గనులున్నాయి. పెద్దేముల్, మర్పల్లి, ధారూర్ మండలాల్లో 41 హెక్టార్ల విస్తీర్ణంలో 65 సుద్ధ గనులు, వికారాబాద్, దోమ మండలాల్లో 86 హెక్టార్లలో 34 కంకర గనులున్నాయి. తాండూరు మండలంలో 12 హెక్టార్లలో 6 గ్రానైట్ గనులుండడంతోపాటు దోమ మండలంలో 76 హెక్టార్లలో 6 పలుగురాళ్ల గనులున్నాయి.