కొడంగల్, నవంబర్ 17 : ఫార్మా చీకట్లు ఎప్పుడు వీడుతాయో.. మళ్లీ ప్రశాంతంగా జీవించే పరిస్థితులు ఎప్పుడు వస్తాయోనని దుద్యాల మండలంలోని ప్రజలు, రైతులు ఎదురు చూస్తున్నారు. ఫార్మా ఘటనతో జరిగిన దమనకాండతో హకీంపేట, లగచెర్ల, పోలేపల్లి, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాల్లోని ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎటువంటి ఘటన ఎదురవుతుందోనన్న భయంతో జీవిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత వెళ్లిన యువకులు, రైతులు ఇంకా ఇండ్లకు తిరిగి రాలేదు. ఫార్మా విలేజ్‌కు తాము భూములిచ్చేది లేదని గత పది నెలలుగా ధర్నాలు, రాస్తారోకోలు, రిలే దీక్షలతో స్పష్టం చేస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సర్వేలు, అధికారులతో ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభలు నిర్వహి స్తుండడంతో విసిగిపోయి అధికారులకు ఎదురుతిరిగినట్లు వారు పేర్కొంటున్నారు.
తాతల కాలం నుంచి భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని.. ఆ పొలాలే తమకు జీవనాధారమని.. అవి లేకుంటే తమ బతుకులు శూన్యమని స్పష్టం చేస్తున్నారు. 252 సర్వేనంబర్‌లో దాదాపు 300 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంటే, అందులో 500 మందికి పైగా పట్టాలు ఉన్నట్లు తెలిపారు. తమ పట్టా భూములను ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నెల 11న దుద్యాల, హకీంపేట గ్రామాల మధ్య అధికారులు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ మీటింగ్‌లో పోలీసులు భద్రతాచర్యలు తీసుకుని ఉంటే ఘటన ఈ విధంగా జరిగేది కాదని అధికారులు, ప్రజలు, రైతులం ప్రశాంతంగా ఉండే వారని పేర్కొంటున్నారు. కాగా, తమకు న్యాయం చేయాలని ఫార్మా భూ బాధిత రైతుల కుటుంబాలు ఢిల్లీకి వెళ్లాయి. జాతీయ ఎస్సీ, ఎస్టీ, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు సీఎం రేవంత్‌పై ఫిర్యాదు చేయనున్నారు. అదేవిధంగా అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకుంటున్నాయి. లగచర్ల ఘటనపై అడిషనల్ డీజీ (లాఅండ్ ఆర్డర్) మహేశ్ భగవత్ సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
బందోబస్తు ఉంటే ఘటన జరిగేదే కాదు..
ఫార్మా కంపెనీల ఏర్పాటును రైతులు ప్రారంభం నుంచే వ్యతిరేకిస్తున్నారు. అధికారులు నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాల్లో తాము భూములను ఇచ్చేది లేదని తేల్చి చెబుతూనే ఉన్నారు. ఏ చిన్న ఘటన జరిగినా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కానీ, ఈ నెల 11న జరిగిన ఘటనా స్థలంలో పోలీసులు ఎందుకు లేరు. ఇంటెలిజెన్స్ ముందస్తు సమాచారం తప్పకుండా ఉంటుంది. అది కూడా సీఎం సెగ్మెంట్ కాబట్టి గట్టి బందోబస్తు, నిఘా ఉంటుంది. కానీ ఆ రోజు భద్రతా యంత్రాంగం లేకపోవడానికి కారణమేంటి..? ఘటన జరిగిన తర్వాత పోలీసులు చేరుకోవడంలో ఆంతర్యమేమిటి..? పోలీసుల వైఫల్యాన్ని బీఆర్ఎస్ పార్టీపై రుద్దడం ఎంత వరకు సమంజసం. ప్రజా సంక్షేమానికి కృషి చేసే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయడం అమానుషం.
-అబ్దుల్ వాహబ్, రాష్ట్ర మైనారిటీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు, బొంరాస్‌పేట
మాజీ ఎమ్మెల్యేను విడుదల చేయాలి..
ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే ప్రజలకు అండగా నిలవడం తప్పా..? ప్రభుత్వమే సక్రమంగా వ్యవహరిస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎందుకు ముందుకొస్తారు. పోలీసులు భదత్రా చర్యలు తీసుకుని ఉంటే అంత రగడ జరిగేదే కాదు. అభం, శుభం తెలియని రైతులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైలుపాలు చేయడం అమానుషం. అక్రమంగా అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యేను బేషరతుగా విడుదల చేయాలి.
– భీములు, కొడంగల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, మాటూర్. దౌల్తాబాద్