రంగారెడ్డి, అక్టోబర్ 1 (నమస్తేతెలంగాణ) : జూబ్లీహీల్స్ ఉప ఎన్నికల బరిలో పదిమంది ఫార్మా రైతులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఫార్మాసిటీ బాధితుల పక్షాన సుమారు పదిమంది రైతులు చివరిరోజైన మంగళవారం తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఫార్మా బాధిత గ్రామాలైన మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, మర్లకుంటతండా గ్రామాలకు చెందిన రైతులు ఉదయం పెద్ద ఎత్తున ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలివెళ్లారు.
రైతులందరి పక్షాన పదిమంది ఎన్నికల బరిలో నిలిచారు. మాటతప్పిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలనే తాము ఎన్నికల బరిలో నిలుస్తున్నామని పలువురు రైతులు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి తమకు అన్యాయం చేస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని రైతులు తెలిపారు.
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల బరిలో పోటీచేసి ప్రభుత్వానికి తమ అసంతృప్తిని తెలియజేయాలని ఫార్మా రైతులు మొదటినుంచి భావించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు గానూ రైతులకు ఎలక్ట్రోరల్ రూల్స్ ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలని రైతులు ముందుగా ఇబ్రహీంపట్నం ఆర్డీఓకు దరఖాస్తు చేసుకున్నారు. మూడు రోజుల పాటు రైతులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధికారులు సతాయించారు.
మంగళవారం నామినేషన్లకు చివరిరోజు ఉండటం వలన రెండురోజులు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చింది. కానీ, రైతుల పక్షాన ఫార్మా వ్యతిరేక పోరాట కమిటి ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తమకు సర్టిఫికెట్లు ఇచ్చేవరకు కార్యాలయం నుంచి కదిలేది లేదని రైతులు అర్థరాత్రి వరకు ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. దిగొచ్చిన అధికారులు గత్యంతరం లేక సర్టిఫికెట్లను అందజేశారు. దీంతో ఫార్మా బాధిత రైతులు గ్రామాల్లో చాటింపు వేయించి మంగళవారం నామినేషన్లకు భారీ ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో నామినేషన్ల కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో అందరుబాధిత రైతులే ఉన్నారు.
తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేసి ఆ భూములను తిరిగి రైతులకే ఇస్తామని, ఆలాగే, నిషేధిత జాబితాలో ఉన్న 2,200ఎకరాలపై కూడా నిషేధాన్ని ఎత్తివేసి రైతులకు ఇస్తామని, ఎన్నికలకు ముందు ప్రస్తుత మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, ప్రస్తుత రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, ప్రస్తుత శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గ్రామాలకు వెళ్లి రైతులకు హామీఇచ్చారు. దీంతో ఆయా గ్రామాల రైతులంతా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి ఓట్లువేసి గెలిపించారు. ఎన్నికల అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టివిక్రమార్క, సీతక్కలు మంత్రులు కాగా, కోదండరెడ్డి రైతు కమిషన్ ఛైర్మన్, మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
కాపీ, ఫార్మా రైతులకు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చటంలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీని రద్దుచేసిన ప్రభుత్వం ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని, అలాగే, రైతుల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించాలని పలుమార్లు మంత్రులు, కోదండరెడ్డితో పాటు ఎమ్మెల్యే రంగారెడ్డిలను కలిసి వినతిపత్రాలు అందజేసినట్టు రైతులు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు దక్కించుకున్న నాయకులు తమ గోడు వినిపించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ రైతుల భూముల్లో బలవంతంగా ఫెన్సింగ్ కూడా వేస్తున్నారని, అధికారులు కోర్టు ధిక్కరణకు కూడా పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టడంకోసం జూబ్లీహీల్స్ ఎన్నికల బరిలో బాధిత రైతుల పక్షాన పదిమంది పోటీచేస్తున్నామని, ఈ రైతులందరి కోసం బాధితరైతులంతా జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మంగళవారం పదిమంది రైతులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో కుందారపు నారాయణ (తాడిపర్తి), మండల లక్ష్మమ్మ (తాడిపర్తి), ముత్యాల సాయిరెడ్డి (నానక్‌నగర్), గడ్డం రవిందర్ (మేడిపల్లి), ఇస్లావత్ రాజు (మర్లకుంటతండా), రమావత్ నందు (మంగలిగడ్డతండా), నేనావత్ సరోజ (మంగలిగడ్డతండా), మంగ అనసూయమ్మ (కుర్మిద్ద), మంగ మణెమ్మ (కుర్మిద్ద), అండేకార్ దేవోజీ (కుర్మిద్ద) ఉన్నారు.