కొడంగల్/పరిగి, అక్టోబర్ 25 ; భూములు కోల్పోవాల్సి వస్తుందేమోనన్న బాధ ఒకవైపు.. ఫార్మా విషం మధ్య బతుకు దుర్భరం అవుతుందన్న భయం మరో వైపు.. వెరసి కొడంగల్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో ఫార్మా విలేజ్‌పై అభిప్రాయ సేకరణ ఉండగా.. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తూ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అగ్గిని రాజేశాయి. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూములు ఇవ్వాల్సిందేనని, ఇవ్వకపోతే ఊరుకునేది లేదని పేర్కొనడంతో పాటు గిరిజనులకు కులం పేరుతో దూషించడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకొని అతడిపై తిరగబడ్డారు. మా భూములపై మీ పెత్తనం ఏంటని వెంటబడి తరిమారు. పోలీసుల సాయంతో సదరు నేత గ్రామపంచాయతీ కార్యాలయంలో తలదాచుకోగా, ఆ కాంగ్రెస్ నాయకుడ్ని తమకు అప్పగించాల్సిందేనంటూ స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో సహనం కోల్పోయిన స్థానికులు హైమాస్ట్ లైట్ల ఏర్పాటు కోసం తీసుకొచ్చిన పెద్ద పైపుతో తలుపులు పగులగొట్టే ప్రయత్నం చేశారు.
పోలీసులు లాఠీచార్జీ చేసి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆ కాంగ్రెస్ నేతను వేరే చోటుకు తరలించారు. ఇది ప్రారంభమేనని, తమ జోలికి, తమ భూముల జోలికి వస్తే ఊరుకోమని స్థానికులు హెచ్చరించారు. భూములను కాపాడుకునేందుకు ప్రాణ త్యాగం చేస్తానని ఓ యువకుడు పెట్రోల్ ఒంటిపై పోసుకోగా.. గమనించిన స్థానికులు, పోలీసులు అతడి నుంచి ఆ బాటిల్‌ను లాక్కున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వికారాబాద్ అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణరెడ్డి రోటిబండతండాకు చేరుకుని రైతులతో మాట్లాడారు. ఒక్కొక్కరి బాధలను అడిగి తెలుసుకున్నారు. ఫార్మా కంపెనీలకు మా భూములు ఇచ్చేది లేదని అన్నదాతలు ముక్తకంఠంతో తెగేసి చెప్పారు. ప్రభుత్వం పోలీసు బలంతో తమ పోరాటాన్ని అణచాలని చూడడం తగదన్నారు. తమ తాతల కాలం నుంచి ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నామని.. ఆ పంట పొలా లు లేకుంటే మా బతుకులు ఆగమై.. వలస వెళ్లాల్సిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఓటేసి గెలిస్తే ముఖ్యమంత్రి అయిన విషయం మరచి, తమ ప్రాంతంలో నే విషం నింపాలని చూస్తున్న రేవంత్‌రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండించారు. తీరు మార్చుకోకపోతే కాంగ్రెస్ నాయకులను బయట తిరగనివ్వమంటూ రైతులు హెచ్చరించారు. రోటిబండతండాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిస్థితి రణరంగంగా మారింది.
రద్దయిన రైతుల అభిప్రాయ సేకరణ..
కొడంగల్, అక్టోబర్ 25 : ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూములు ఇవ్వబోమని దుద్యాల మండలంంలోని లగచర్ల గ్రామ రైతులు తెగేసి చెప్పారు. శుక్రవారం ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు అభిప్రాయ సేకరణ కార్యక్రమం రద్దయ్యింది. రోటిబండ తండాకు చెందిన ఫార్మా భూ బాధితులు కాంగ్రెస్ నాయకుడిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆగ్రహించిన రైతులు టెంట్లను తొలగించడంతో పాటు కుర్చీలను చిందరవందర చేశారు. దీంతో అధికారులు ఎవరూ కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం రద్దయ్యింది.
రైతు బాధను గుర్తించి.. ఫార్మాను రద్దు చేయాలి..
రైతుల బాధను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి.. ఫార్మా కంపెనీల ఏర్పాటు చర్యలను వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం దుద్యాల మండలంలోని లగచర్ల, రోటిబండతండాలో రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిపై ఆయన స్పందించి మాట్లాడారు. ఫార్మా కంపెనీలు వస్తే ఈ ప్రాంతం కలుషితమవుతుందని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల కోసం గత ప్రభుత్వం పెద్ద మొత్తంలో భూములు సేకరించి సిద్ధంగా ఉంచిందని, ఆ ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయకుండా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు. పచ్చటి పంట పొలాల్లో కాలుష్యాన్ని నింపాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆంతర్యమేమిటో తెలుపాలని ప్రశ్నించారు.