బొంరాస్‌పేట, నవంబర్ 9 : వానకాలంలో వర్షాధారం కింద రైతులు జిల్లాలో సాగుచేసే ప్రధాన పంట కందిపంట. నల్లరేగడి భూములతో పాటు మెట్ట పొలాల్లో కూడా రైతులు ఎక్కువ విస్తీర్ణంలో కంది పంటను సాగు చేస్తారు. వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది 1,31,290 ఎకరాల్లో కంది పంటను సాగు చేశారు. అధిక వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో కంది పంటకు నష్టం జరిగినా చాలా ప్రాంతాల్లో కంది ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం పూత దశలో ఉంది. రైతుల ఆశలన్నీ కందిపైనే ఉన్నాయి. అధిక దిగుబడులు వస్తే పెట్టిన పెట్టుబడులు తీరి.. లాభం వస్తుందని రైతులు ఆశతో ఉన్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటకు పూత, కాత దశలో తెగుళ్లు, పురుగులు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తుంటాయి. తెగుళ్లు పురుగులను నివారించడానికి రైతులు ఫర్టిలైజర్ డీలర్లు, గ్రామాల్లోకి వాహనాల్లో వచ్చే ప్రైవేటు పురుగు మందుల వ్యాపారులు ఇచ్చే మందులను వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి పంటలకు వినియోగిస్తారు. వీటితో ఉపయోగం లేకపోవడమే కాకుండా రైతులకు రెండు రకాలుగా నష్టం కలుగుతుంది. ఈ నేపథ్యంలో కంది పంటను ఆశించే తెగుళ్లు, పురుగులను నివారించడానికి సరైన సస్యరక్షణ పద్ధతులు పాటిస్తూ వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే కందిలో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయాధికారులు తెలియజేశారు.
కందిసాగు మండలాల వారీగా..
జిల్లాలోని 19 మండలాల్లో ఈ ఏడాది వానకాలంలో 1,31,290 ఎకరాల్లో కంది పంటను రైతులు సాగు చేశారు. బొంరాస్‌పేటలో 6461ఎకరాలు, దౌల్తాబాద్‌లో 12,124, కొడంగల్‌లో 7,484, చౌడాపూర్‌లో 442, దోమలో 2583, కులకచర్ల 1092, పరిగి 2996, పూడూరు 1258, బషీరాబాద్ 21,355, పెద్దేముల్ 12,694, తాండూరు 20,104, యాలాల 7,318, బంట్వారం 2730, ధారూరు 4726, కోట్‌పల్లి 3513, మర్పల్లి 6531, మోమిన్‌పేట 4721, నవాబ్‌పేట 4548, వికారాబాద్‌లో 8603 ఎకరాల్లో కంది పంటను సాగు చేశారు.
కంది పంటలో తెగుళ్లు నివారణ చర్యలు
ఆకుగూడ పురుగుఃఅధిక వర్షపాతం నమోదు అయినప్పుడు పంట ఎదుగుదల దశలో ఇది ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు మోనోక్రొటోపాస్ 1.6 ఎంఎల్ లేదా క్వినాల్పాస్ 2 ఎంఎల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మరుక మచ్చల పురుగు : పూత దశలో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు పొగమంచు, చిరుజల్లులు కురిసినప్పుడు ఈ పురుగు ఆశిస్తుంది. నివారణకు 2.5 ఎంఎల్ క్లోరోఫైరిపాస్, డైక్లోకినాస్ 1 ఎంఎల్ లేదా ప్రొఫెనోపాస్ 2 ఎంఎల్ లేదా నోవాల్యూరాన్ 1 ఎంఎల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు స్పైనోశాడ్ 0.3 ఎంఎల్ లేదా ఇమామెక్టిన్ జెంబోమేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రానిల్ప్రోల్ 0.3 ఎంఎల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
శనగపచ్చ పురుగు : వర్షం లేదా చిరు జల్లులు పడినప్పుడు ఒక్కసారిగా రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగినప్పుడు మొగ్గ, పూత, కాయ దశలో ఈ పురుగు ఆశిస్తుంది. దీనిని నివారించడానికి ఎసీఫేట్ 1.5 గ్రాములు లేదా క్వినాల్పాస్ 2 ఎంఎల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇండాక్స్కార్బ్ 1.0ఎంఎల్ లేదా స్పెనోశాడ్ 0.3 ఎంఎల్ లేదా లామ్డాసైహలోత్సిన 1 ఎంఎల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు : ఈ పురుగు కంది చివరి దశలో ఎక్కువగా ఆశిస్తుంది. కాయను తొలిచి గింజలను తింటుంది. దీనిని నివారించడానికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రొటోపాస్ 1.6 ఎంఎల్ లేదా క్వినాల్పాస్ 2 ఎంఎల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కాయ రసం పీల్చే పురుగు : పిందె కాయ అభివృద్ధిచెందే దశలో(నవంబర్-డిసెంబర్) బెట్ట వాతావరణ పరిస్థితులు(వరుసగా వర్షాలు కురిసి ఆ తరువాత ఎండలు కొట్టే సమయం) నెలకొన్నప్పుడు ఈ పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు డైమిథోయేట్ 2ఎంఎల్ లేదా మోనోక్రొటోపాస్ 1.6 ఎంఎల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
జాగ్రత్తలు తీసుకోవాలి
కందిపంటలో సరైన సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. పంటలకు ఆశించే పురుగును గమనిస్తూ ఉండి వాటి నివారణకు సూచించిన మందును పిచికారీ చేయాలి. గ్రామాల్లో క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు రైతులకు కంది పంటలో సస్యరక్షణ పద్ధతులపై వివరిస్తున్నాం.
– ఏవో పద్మావతి, బొంరాస్‌పేట