వికారాబాద్, డిసెంబర్ 25 : అత్యాశకు పోతే.. ఉన్నది పోయినట్లయింది వికారాబాద్ జిల్లాలోని కొంతమంది పరిస్థితి. యాప్‌లో కొంత పెట్టుబడి పెడితే నిత్యం కాసుల వర్షం కురుస్తుందని నిర్వాహకులు ప్రజలను నమ్మించారు. దీంతో పెట్టుబడి పెట్టిన తరువాత ఆ యాప్‌ను పనిచేయకుండా చేశారు ప్రబుద్ధులు. వికారాబాద్ జిల్లాలో ఆర్పీసీ యాప్‌లో యువత భారీగా పెట్టుబడి పెట్టారు. ముందుగా యాప్‌ను ఓపెన్ చేయాలంటే ఫోన్ నంబర్ తదితర పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయాలి. ఆ తరువాత ఒక్కొక్క లెవల్లో ఒక్కో రకంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మొదటి లెవల్లో రూ.2100 పెట్టుబడి పెడితే రోజుకు రూ.70, రూ.6000 కడితే రూ.200, 18,200 కడితే రూ.650, రూ.56వేలు కడితే రూ.2వేలు, రూ.1.30 లక్షలు కడితే రూ.5వేలు జమ చేస్తామని నిర్వాహకులు ఆశ చూపారు.
దీంతో ప్రజలు రూ.లక్షల్లో కట్టినట్లు సమాచారం. ఇప్పటికి 5 లెవల్స్ ఓపెన్ కాగా.. మిగిలిన 4 లెవల్స్‌లో భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. డబ్బులు కట్టిన వ్యక్తులకు రోజూ ఖాతాలో డబ్బులు పడినా, విత్‌డ్రా మాత్రం ప్రతి బుధవారం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. గత వారం కట్టిన డబ్బులకు అమౌంట్ బుధవారం విత్‌డ్రా కాకపోవడంతో యాప్ నిర్వాహకులకు ఫోన్ చేశారు. వారిని శాంతపరిచేందుకు హైదారాబాద్‌లో ఒక ఈవెంట్‌ను పెట్టినట్లు సమాచారం వచ్చింది. ఈవెంట్‌కు వచ్చినవారికి నిర్వాహకులు మళ్లీ బుధవారం విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్పగా.. వారం రోజులుగా ఆగి విత్‌డ్రా చేసుకుందామని ఎదురు చూసినవారికి నిరాశే మిగిలింది. ఈలోపు నిర్వాహకులు ఆ యాప్‌ను ఎత్తివేశారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు తలలు బాదుకుంటున్నారు. పోలీసులు ఎన్నోసార్లు యాప్‌లలో పెట్టుబడిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రజల్లో మార్పు రావడంలేదు.