కేసీఆర్ హయాంలో జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 21 మండలాల్లో అభివృద్ధి పనుల నిమిత్తం రూ. వందల కోట్ల నిధులను కేటాయించి టెండర్లు కూడా పిలిచారు. అయితే ప్రభుత్వం మారడంతో ఆ పనులకు మోక్షం లభించడం లేదు. నిధులున్నప్పటికీ ఒక్క పని కూడా ముందుకు సాగకపోవడంతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. గత ప్రభుత్వం లో జిల్లాలోని మున్సిపాలిటీలు, మండలాల్లో వివిధ రకాల పనులను చేపట్టేందుకు ఎన్నికలకు ముందు గత సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ప్రొసీడింగ్లూ అందజేశారు. కొన్నిచోట్ల శంకుస్థాపనలూ జరిగాయి.
-రంగారెడ్డి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు కేసీఆర్ హయాంలో అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు కేటాయించారు. అయితే ప్రభు త్వం మారడంతో ఆ పనులకు అవసరమైన నిధులున్నా ఒక్క పని కూడా సాఫీగా సాగడం లేదు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, మురుగుకాల్వలు, అసంపూర్తి భవనాలు తదితర వాటి కోసం సుమారు రూ. 424 కోట్ల నిధులు కేటాయించి టెండర్లు పిలిచినా పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. అంబేద్కర్ చౌరస్తా నుంచి నాగన్‌పల్లి వరకు సుమారు రూ. 60 కోట్లతో ఎస్ఆర్డీఈసీ పనులు, సాగర్ రహదారిలోని ఖానాపూర్ గేటు నుంచి నాగన్‌పల్లి రోడ్డు వరకు బైపాస్ రోడ్డు కోసం రూ.3 కోట్లు, ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణకు రూ.9 కోట్లు కేటాయింపు కూడా పూర్తైంది. అలాగే ఆమనగల్లు, షాద్‌నగర్, మహేశ్వరం, చేవెళ్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ హయాంలో నిధులు మంజూరై టెండర్లు పూర్తైనా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు.
అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి లష్కర్‌గూడ వైపు వెళ్లే దారిలో ఉన్న కల్వర్టు ఆధునీకరణకు కేసీఆర్ ప్ర భుత్వం రూ.5 కోట్లను కేటాయించగా టెండర్ల ప్రక్రి య కూడా పూర్తైంది. అయితే కాంట్రాక్టర్ కొంతమేర పూర్తి చేశారు. మిగతా పనులకు సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో అక్కడికే ఆగిపోయాయి. నిధులున్నా పనులను చేపట్టకపోవడంతో లష్కర్‌గూడ, అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లష్కర్‌గూడ కల్వర్టు వద్ద వర్షం నీరు పొంగి ఆ వాగులో కారు కొట్టుకుపోయి ఇద్ద రు వ్యక్తులు మృతిచెందారు. ఈ కల్వర్టు ప్రమాదకరంగా ఉన్నదని.. దానిని ఆధునీకరించి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును ఆధునీకరించడంతోపాటు దానిని పర్యాటక కేంద్రంగా మా ర్చేందుకు గత ప్రభుత్వం రూ.9 కోట్లను కేటాయించింది. కానీ, ప్రభుత్వం మారడంతో చెరువుకట్ట పనులకు బ్రేక్‌పడింది. జిల్లాలోని అన్ని చెరువులు ఆధునీకరణకు నోచుకున్నా ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు మాత్రం మోక్షం లభించడం లేదు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా నేటికీ ఏ ఒక్క చిన్న పనిని కూడా చేపట్టలేదు. గత ప్రభుత్వం నిధులు కేటాయించిన పనులను కూడా పూర్తి చేయకపోవడం సిగ్గుచేటు. ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ప్రభుత్వ దవాఖాన.. ఇబ్రహీంపట్నం నుంచి నాగన్‌పల్లి మీదుగా అనాజ్‌పూర్ వరకు ఉన్న రోడ్డుతోపాటు సెగ్మెంట్లో పలు రకాల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రేవంత్ సర్కారు మాటలతోనే సరిపెడుతున్నది.
-ఏనుగు భరత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ
కేసీఆర్ హయాంలో నిధులు మంజూరై అసంపూర్తిగా నిలిచిపోయిన లష్కర్‌గూడ -అబ్దుల్లాపూర్‌మెట్ రోడ్డులో వెంటనే బ్రిడ్జిని నిర్మించాలి. వానలు కురిసినప్పుడు ఈ రోడ్డులో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా పనులు చేపట్టకపోవడం తగదు.
-సీక సాయికుమార్‌గౌడ్, లష్కర్‌గూడ