వికారాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటికి రావాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల దృష్ట్యా ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మూసీ, ఈసీ నదులతోపాటు వాగులు పొంగిపొర్లుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసర సమ యాల్లో సాయంకోసం కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసేలా అధికారు లు కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారని, టోల్ ఫ్రీ నంబర్ 799506 1192, 08416-235291 నంబర్లను సంప్రదించాలన్నారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి
జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ముందస్తు జాగ్రత్త చర్య లు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి వాటిలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. విద్యుదాఘాతంతో ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వేలాడే విద్యుత్తు వైర్లు, ఫెన్సింగ్లేని ట్రాన్స్ఫార్మర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నా రు. వాగులు వద్ద బారీకేడ్లను ఏర్పాటు చేసి రెవెన్యూ, పోలీస్ సిబ్బంది 24 గంటలపాటు కాపలాగా ఉండాలన్నారు. భారీ వర్షాలతో ఇప్పటికే అన్ని చెరువులు నిండిన దృష్ట్యా కట్టలు తెగి గండ్లు పడే అవకాశమున్నందున ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అధికారులెవరూ సెలవులో వెళ్లొద్దన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యానాయక్, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.