రంగారెడ్డి, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : చేవెళ్లలో శనివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజానీకాన్ని చూసి గులాబీ అడ్డ పులకించిపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అశేష ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. కేసీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు ఈలలు, చప్పట్లతో ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తింది. దారులన్నీ చేవెళ్లవైపే..అన్నట్లుగా దారులన్నీ జనంతో కళకళలాడుతూ గులాబీమయమయ్యా యి. సభా వేదికపై కళాకారుల ఆటపాటలు ఉర్రూతలూగించాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన తొలి సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

ప్రజా ఆశీర్వాద సభతో చేవెళ్ల గడ్డ పులకించగా..ఈ సభ ప్రతిపక్ష పార్టీల్లో వణుకు పుట్టించింది. బీఆర్ఎస్ సభతో పోల్చుకుంటే ఈనెల 6న కాంగ్రెస్ రాహుల్ గాంధీతో నిర్వహించిన సభ వెలవెలబోయిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. కాంగ్రెస్ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనాన్ని తరలించగా..కేవలం చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రజలతో నే ప్రజా ఆశీర్వాద సభ కిక్కిరిసింది. ప్రతిపక్ష నేతల్లో గుబులు పుట్టించేలా.. కేసీఆర్ మాటలకు చప్పట్లు, ఈలలు, కేరింతలు ప్రతిధ్వనించాయి. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించినప్పుడు, విపక్షాల తీరును ఎత్తి చూపినప్పుడు జనమంతా జనం ఈలలు, చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. జై తెలంగాణ..జై కేసీఆర్..జై జ్ఞానేశ్వర్ అన్న నినాదాలతో చేవెళ్ల పట్టణం దద్దరిల్లింది.
