తుర్కయంజాల్, మార్చి 17: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ (Turkayamjal) ప్రధాన రహదారిపై రోజు రోజుకు వాహనాల రద్ది పెరుగుతున్నది. దీంతో రోడ్డు దాటాలంటే పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు దాటుకున్న క్రమంలో పలువురు ప్రమాదాల బారినపడుతున్నారు. ఈనేపథ్యంలో పాదచారుల సౌలభ్యం కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Foot Over Bridge) నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్- నాగార్జున సాగర్ హైవేపై ఉన్న తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. హైదరాబాద్కు దగ్గరగా ఉండటంతోపాటు అన్ని వసతులు అందుబాటులో ఉండటంతో ప్రజల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. దీంతో హైవేపై వెళ్లే వాహానాలతోపాటు పట్టణంలో జనాభా పెరగడంతో వాహనాల రద్దీ అధికమైంది. హైవేపై నిత్యం వందలాది వాహనాలు పరుగులు పెడుతుండటంతో తుర్కయంజాల్ చౌరస్తాలో పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని రోడ్డు దాటుతూ మృత్యువాత పడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. సాగర్ ప్రధాన రహదారికి ఇరువైపులా దవాఖానాలు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. దీంతో పాదచారులు రోడ్డును దాటి మరోవైపుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వేగంగా దూసుకువస్తున్న వాహనాలతో పాదాచారులు ప్రమాదాల బారీన పడుతున్నారు.
గతంలో తుర్కయంజాల్ చౌరస్తాలో రోడ్డును దాటడానికి యూటర్న్ ఉండగా చౌరస్తాలో వాహనాలు మలుపు తీసుకునేప్పుడు ప్రమాదాలు జరుగుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు యూటర్న్ మూసివేసి దిమ్మెలను ఏర్పాటు చేశారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి తుర్కయంజాల్ మున్సిపాలిటీ కార్యాలయానికి, దుకాణాలకు వేళ్లే పాదచారులు దిమ్మెలపై నుంచి రోడ్లను దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పట్టణంలోని పలు వైన్స్ షాపుల వద్ద రాంగ్రూట్లో వెళ్లే వాహనాల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తుర్కయంజాల్తో పాటు ఇంజాపూర్, రాగన్నగూడ చౌరస్తాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మించాలని స్థానికులు గతకొలంగా ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్నారు. ప్రమాదాల సంఖ్య పెరగకముందే ప్రభుత్వం తుర్కయంజాల్ చౌరస్తాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే ఇబ్బందులు తప్పడంతో పాటు ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
రోడ్డు దాటాలంటే భయంగా ఉంది..
రోడ్డు దాటాలంటే భయంగాదని రాగన్నగూడకు చెందిన అశ్విని అన్నారు. వివిధ పనులపై నగరానికి వెళ్లి వస్తుంటామని, సాగర్ రోడ్డు గతంతో పోలీస్తే చాలా పెద్ద విస్తిర్ణంలో ఉందన్నారు. రోడ్డును దాటుతున్న క్రమంలో ప్రమాదాల భారిన పడుతున్నామని చెప్పారు. తుర్కయంజాల్ చౌరస్తాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి చిన్నదానికి రోడ్డును దాటాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. చౌరస్తాలో జరిగిన ప్రమాదాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తుర్కయంజాల్ చౌరస్తాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తే ఎంతో మంది ప్రాణాలను నిలబడుతాయని చెప్పారు.