పరిగి, జూలై 3 : కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వానకాలం వచ్చినా బిందెడు నీరు అందక మహిళలు అల్లాడు తున్నారు. రోడ్డెక్కి ఆందోళన చేయడంతోపాటు ఏకంగా మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. మండలంలోని బర్కత్‌పల్లి గ్రామంలో గత రెండు వారాలుగా తాగునీటి కోసం అవస్థలు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
గ్రామపంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరుకారని.. వచ్చినప్పుడు నీటి సమస్యను చెబితే పరిష్కరించడం లేదని పేర్కొంటూ బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన మహిళలు గురువారం ఖాళీ బిందెలతో గ్రామంలోని ప్రధాన రహదారిలో ఆందోళన చేపట్టారు. సుమారు గంటసేపు అక్కడ నిరసన తెలిపి .. తమ సమస్యను పరిష్కరించాలని పరిగిలోని మండల పరిషత్ కార్యాలయాన్ని ఖాళీ బిందెలతో ముట్టడించారు.
తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని.. గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరిగ్గా రావడం లేదని, ప్రత్యామ్నాయంగా నీటి సరఫరా చేయాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఎవరైనా సమస్యలపై గట్టిగా ప్రశ్నిస్తే పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేస్తారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరితే.. రూ.500 ఇస్తే ట్యాంకర్‌తో నీటిని తెప్పిస్తామని పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నట్లు గ్రామస్తురాలు భీమమ్మ ఆరోపించారు. తాగునీటి సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనను కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. విధులకు సక్రమంగా హాజరుకాని పంచాయతీ కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు ఆందోళన చేసిన సమయంలో అధికారులు లేకపోవడంతో కార్యాలయ ఉద్యోగికి మెమోరాండాన్ని అందజేశారు.