పూడూరు, నవంబర్ 6 : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్-మన్నెగూడ రోడ్డు విస్తరణతోపాటు అంగడిచిట్టంపల్లి గేట్ నుంచి కంకల్ వరకు రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేస్తూ హైవేపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు వెంకటయ్య, రవీందర్ మాట్లాడుతూ .. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణకు గత కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. కానీ, రేవంత్ సర్కా ర్ మాత్రం రోడ్డు విస్తరణ పనులను చేపట్టడంలేదని ఆరోపించారు. హైదరాబా-బీజాపూర్ హైవేపై వాహనాల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతుండడం.. రోడ్డు విస్తరణ కాకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
చిట్టంపల్లి నుంచి కంకల్ వరకు సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా గుంతలు పడి ప్రమాదంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు గడుస్తున్నా ఒక్కరోడ్డుకూ నిధులు మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేండ్ల నుంచి ఈ హైవేపై 350 ప్రమాదాలు జరుగగా 225 మంది మృతి చెందినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా హైదరాబాద్-బీజాపూర్ హైవేతోపాటు అంగడి చిట్టంపల్లి నుంచి లాల్పహాడ్కెళ్లే రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రఘవేందర్, రాజు, బీఆర్ఎస్ మండల నాయకులు రహీస్ ఖాన్, రవి, యెసయ్య, శ్రీనివాసాచారి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.