కేశంపేట, జూన్ 7 : రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కాకునూరు – లేమామిడి గ్రామాల మధ్యగల వంతెన నిర్మాణానికి గ్రహణం వీడటంలేదు. దశబ్దాలుగా ఎదురు చూస్తున్న లేమామిడి, కాకునూరు, నిర్దవెల్లి గ్రామాల ప్రజల కల సాకారమవుతుందన్న ఆశ పాలకుల తీరుతో అడియాశగానే మిగులుతున్నాయి. బిల్లురాలేదని కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే నిలిపివేయడంతో వంతెన నిర్మాణానికి మోక్షమెప్పుడో? అంటూ నిట్టూరుస్తున్నారు. కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వర్షం వచ్చి వాగు పారితే 12కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తుందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పనుల్లో వేగం పెంచాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.
కేశంపేట మండల పరిధిలోని లేమామిడి, కాకునూరు గ్రామాల మధ్యగల వంతెన నిర్మాణంకోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా గత బీఆర్ఎస్ పాలనలో 5.33కోట్ల నిధులు మంజూరుకావడంతో హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్ కోటేశ్వర్రెడ్డి పనులను దక్కించుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో వేగంగా పనులు జరిగినప్పటికీ ఎన్నికల కోడ్ రావడం, అనంతరం ప్రభుత్వం మారడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పెద్ద మొత్తంలో డబ్బులను పెట్టి పనులు చేసినా బిల్లులు రాకపోవడంతో పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా వంతెన నిర్మాణానికి గ్రహణం వీడి నత్తనడకన సాగుతున్న పనుల్లో వేగం పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
వాగు పారితే రాకపోకలు బంద్..
వర్షాకాలంలో వర్షాలు వచ్చి వాగు పారితే లేమామిడి – కాకునూరు, నిర్దవెల్లి – కాకునూరు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోతాయి. నిర్దవెల్లి నుంచి కాకునూరుకు వెళ్లాలంటే కేవలం 4కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సరిపోతుందని, కానీ వాగు పారుతున్న సమయంలో నిర్దవెల్లి నుంచి కాకునూరు గ్రామానికి వెళ్లాలంటే లేమామిడి, కేశంపేట, వయా కాకునూరుకు వెళ్లాల్సి వస్తుందని, తద్వారా 12కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెనను నిర్మిస్తే కాకునూరు, కొండారెడ్డిపల్లి, పోమాల్పల్లి, ఇప్పలపల్లి వయా షాద్నగర్ రాకపోకలకు మార్గం మరింత సులభతరమవుతుందని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. వంతెన నిర్మిణం జరగకపోవడంతో ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.