ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తున్నది. అధునాతన సాఫ్ట్వేర్, కొత్త విధానాల వంకతో ‘ఉపాధి’ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో ఎంతోమంది కూలీలకు ఉపాధి కరువైంది. కూలీలు ఉదయం, సాయంత్రమూ పనులకు హాజరుకావాలని, రెండుపూటలా ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలనే నిబంధనలతో ఇటు కూలీలు, అటు సిబ్బంది అసౌకర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో చేపడుతున్న ఒక పని పూర్తైన తర్వాతనే మరో పనిని చేపట్టాలనే మార్గదర్శకాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. నిత్యం చేపడుతున్న పనులను ఎప్పటికప్పుడు యాప్‌లో పొందుపర్చాలని కేంద్రం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో సిగ్నల్స్ సరిగా లేక.. ఫొటోలు అప్లోడ్ కాక సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రధానంగా తెలంగాణ సర్కార్ నిర్మిస్తున్న కల్లాల పనులను కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నుంచి తొలగించి సమస్య తీవ్రతను మరింత పెంచింది. వికారాబాద్ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి దాదాపు 31.41 లక్షల పనిదినాలు తగ్గాయి. అందులోనూ కేవలం 1293 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనిని కల్పించారు. నిరుపేదల కడుపు నింపుతున్న ఉపాధి పథకంపై కేంద్రం అవలంబిస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
-వికారాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువచ్చింది. ప్రభుత్వ సంస్థలన్నింటినీ అదానీలాంటి పెట్టుబడుదారులకు అప్పగించేలా ప్రైవేట్‌పరం చేస్తూ వస్తున్న మోదీ ప్రభుత్వం.. కరువును అధిగమించడమే లక్ష్యంగా గత కొన్నేండ్లుగా నిరుపేదల కడుపు నింపేందుకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఉపాధి హామీ తనిఖీల పేరిట పలు జిల్లాల్లో పనులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బృందాలు క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు భిన్నంగా తప్పుడు రిపోర్టులతో ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిలిపివేసే కుట్ర పన్నుతున్నారు. దీంతో ఉపాధి హామీ పనులనే నమ్ముకొని బతుకుతున్న కూలీలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన పనులకు సంబంధించి కూడా నిధులను నిలిపివేసింది. తెలంగాణకు హరితహారం, క్రీడా ప్రాంగణాలు, కల్లాలు, వైకుంఠధామాలకు సంబంధించి నిధులను కేంద్రం పూర్తిగా నిలిపివేసింది. సంబంధిత పనులన్నింటినీ పూర్తి చేసినప్పటికీ నిధుల మంజూరులో మాత్రం కేంద్ర ప్రభుత్వం గతేడాదిగా జాప్యం చేస్తూ వస్తున్నది. కేంద్రం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చి ఎన్నో కుటుంబాలకు ఉపాధిని దూరం చేసిన మోదీ ప్రభుత్వంపై ఉపాధి హామీ కూలీలందరూ దుమ్మెత్తిపోస్తున్నారు.
10 శాతం కుటుంబాలకు కూడా దొరకని వంద రోజుల పని
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఈ ఆర్థిక సంవత్సరం వేల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఆర్థిక సంవత్సరంలో కనీసం 10 శాతం మేర కుటుంబాలకు కూడా పనిని కూడా కల్పించలేకపోయింది. ఈ నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 1293 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనిని కల్పించారు. గతేడాది 19,998 కుటుంబాలకు వంద రోజులపాటు పనులను కల్పించగా, ఇప్పటివరకు కేవలం 6 శాతం మేర మాత్రమే కుటుంబాలకు వంద రోజులపాటు పనిని కల్పించారు.
కక్ష సాధింపు చర్యలు
జిల్లాలోని వికారాబాద్, మర్పల్లి, మోమిన్‌పేట, కొడంగల్, బొంరాస్‌పేట మండలాల్లో 100 కుటుంబాలకుపైగా వంద రోజులపాటు పనిని కల్పించగా.. మిగతా 13 మండలాల్లో సింగిల్, డబుల్ డిజిట్‌లోనే కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. పరిగి, పూడూరు, కోట్‌పల్లి మండలాల్లో అత్యల్పంగా కేవలం 4 కుటుంబాలకు మాత్రమే వంద రోజులపాటు పనిని కల్పించారు. రెండేండ్లలో 50 లక్షల పనిదినాలను జిల్లాలో తగ్గించారంటే ఉపాధి హామీ పథకంపై మోదీ ప్రభుత్వం ఏ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. 2021-22లో 1.03 లక్షల పనిదినాలను కల్పించగా, ఈ ఏడాది 31.41 లక్షల పనిదినాలను తగ్గిస్తూ 71.58 లక్షల పనిదినాలను కల్పించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మరో 20 లక్షల మేర పనిదినాలను తగ్గిస్తూ 50 లక్షల పనిదినాలను కల్పించాలని ప్లానింగ్ సిద్ధం చేశారు. ఈ ఏడాది నిర్ణయించిన పని దినాల్లో ఇప్పటివరకు 50.93 లక్షల పని దినాలను కల్పించారు.
కొత్త నిబంధనలతో తగ్గిన పనిదినాలు
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్-ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌తో జిల్లాలోని లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. కొత్త సాఫ్ట్వేర్ విధానంతో కూలీలు తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం పనులకు తప్పనిసరిగా హాజరుకావాలని షరతులను విధించింది. కూలీలు చేస్తున్న పనులకు సంబంధించి ఉదయం 11 గంటలలోపు ఒక ఫొటో, సాయంత్రం 2 గంటల తర్వాత రెండో ఫొటో తప్పనిసరిగా తీయడంతోపాటు అప్లోడ్ చేస్తున్నారు. ఒక గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి ఒక పని పూర్తైన తర్వాతనే మరొక పని చేపట్టాలని నిబంధన విధించారు. దీంతో గతంలో మాదిరిగా కాకుండా పనులు చాలా ఆలస్యమవుతున్నాయి. ప్రతిరోజూ చేపడుతున్న పనులను వెంటనే యాప్‌లో పొందుపర్చాలనే నిబంధనలతో క్షేత్రస్థాయిలో సిగ్నల్ లేకపోవడంతో అప్లోడ్ చేయడం ఇబ్బందిగా మారి పనులు కూడా జాప్యం జరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా వివిధ పథకాల అమలుకు సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ నిధులకు సంబంధించి కూడా కేంద్రం కోత విధించడం గమనార్హం.