మాడ్గుల, జనవరి 9 : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం మాడ్గుల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన క్రయవిక్రయదారులు సర్వర్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుని ప్రభుత్వానికి చలాన్ల రూపంలో లక్షలాది రూపాయలు చెల్లించి.. రిజిస్ట్రేషన్ల కోసం వస్తే సర్వర్ సమస్య ఉన్నదని సిబ్బంది చెప్పడంతో క్రయవిక్రయదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా ఇదే తంతు జరుగుతుండడంతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సాయంత్రం వరకు వేచి చూచి రిజిస్ట్రేషన్లు జరుగకపోవడంతో ఇంటి బాట పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా దాదాపు 25 రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు సమాచారం.
గత బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి సమస్యలు ఎప్పుడూ రాలేదు. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సక్రమంగా రిజిస్ట్రేషన్లు ఆయిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటే సర్వర్ రాదు. సర్వర్ ఉంటే కరెంట్ రాదు. గత వారం రోజులుగా తహసీల్దార్ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు వేచి చూచి మళ్లీ ఇంటికి వెళ్తున్నా. ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలి.
– పాపయ్యగౌడ్, నల్లచెరువు గ్రామం
ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ అయి ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వస్తే సర్వర్ లో సమస్య ఉందని సిబ్బంది చెప్పడం సమంజసం కాదు. రిజిస్ట్రేషన్లో ఏమైనా సమస్యలు ఉంటే స్లాట్లూ బుక్ కాకుండా చూడాలి.
-చక్రూనాయక్, గుడితండా
రిజిస్ట్రేషన్ కోసం రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు వచ్చి తిండి తిప్పలు లేకుండా సాయంత్రం వరకు పడిగాపులు కాస్తు న్నా. సర్వర్లో ఏదైనా సమస్య ఉంటే అధికారు లు ముందుగా రిజిస్ట్రేషన్దారులకు సమాచారం
ఇవ్వాలి.
-మాడుగుల మహేశ్, మాడ్గుల గ్రామం