బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పూర్తయిన పనులకు సంబంధించి చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాదైనా కాంట్రాక్టర్లకు నిధులను ఇంకా విడుదల చేయకపోవడం గమనార్హం. గతేడాదిగా జిల్లా విద్యాశాఖ అధికారులు కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ నిధుల విడుదలలో నిర్లక్ష్యం వహిస్తున్నది. స్కూల్ కమిటీలు, సంబంధిత అధికారుల ఒత్తిడితో పలు స్కూళ్లలో పనులు పూర్తి చేసిన చిన్నచిన్న కాంట్రాక్టర్లు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పనులు పూర్తి చేసిన వారిలో చాలావరకు స్కూల్ కమిటీ సభ్యులే ఉండడం, వారు అప్పులు చేసి పనులు పూర్తి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులకు సంబంధించి బిల్లులు చేసి ప్రభుత్వానికి అందజేసినప్పటికీ సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు సైతం సంబంధిత బిల్లుల విషయంలో త్వరలో నిధులు విడుదల అవుతాయని కాంట్రాక్టర్లకు చెప్తూ చేతులెత్తేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 371 స్కూళ్లను మన ఊరు-మన బడిలో భాగంగా ఎంపిక చేయగా, 20 స్కూళ్లలో పనులు పూర్తికాగా స్కూళ్లను కూడా గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 300 స్కూళ్లలో పనులు 20-50 శాతం మేర పనులు పూర్తయ్యాయి. సంబంధిత పనులకు సంబంధించి రూ.10 కోట్ల చెల్లింపులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నది.
– వికారాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ)
ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకుగాను బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. మొదటి విడతలో ఎంపిక చేసిన స్కూళ్లలో మండలానికి, మున్సిపాలిటీకి రెండు చొప్పున జిల్లాలో 20 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి సంబంధిత స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి పనులు పూర్తి చేశారు.
ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్ చాక్బోర్డులు, పెయింటింగ్, ప్రహరీ నిర్మాణం, కిచెన్ షెడ్ల నిర్మాణం, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లను సంబంధిత ప్రభుత్వ పాఠశాలల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లావ్యాప్తంగా 1054 ప్రభుత్వ పాఠశాలలుండగా వీటిలో మొదటి విడతలో 371 స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకుగాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో ఎంపిక చేసిన స్కూళ్లలో ఉన్నత పాఠశాలలు-111, ప్రాథమికోన్నత పాఠశాలలు-40, ప్రాథమిక పాఠశాలలు-220 పాఠశాలలున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఊరు-మన బడి స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. మన ఊరు-మన బడిలో భాగంగా ఎంపిక చేసిన 20 శాతం పనులు పూర్తైన స్కూళ్లు కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో కొత్త స్కూళ్లను ఎంపిక చేసి పనులు చేస్తున్నారు. ‘మన ఊరు-మన బడి’లో ఇప్పటికే కొంతమేర పనులు పూర్తైన స్కూళ్లలోనే పనులు చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమైనా కాంగ్రెస్ సర్కారు సంబంధిత స్కూళ్లను పట్టించుకోకపోవడం గమనార్హం. మన ఊరు-మన బడి కార్యక్రమంలో పనులు ప్రారంభించిన స్కూళ్లలో చేయకుండా కొత్త స్కూళ్లలో పనులు చేస్తూ రేవంత్ సర్కారు కక్ష సాధింపు చర్యలు చేస్తుండడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.