షాబాద్, అక్టోబర్ 6: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పి, బీఆర్ఎస్ సత్తా చాటుదామని షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అవినాశ్‌రెడ్డి సమక్షంలో కుర్వగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశోక్‌యాదవ్, రాందాస్యాదవ్, నర్సింహులుయాదవ్, శివరాజ్‌యాదవ్, రాంచంద్రయ్య, శివకుమార్, సదానందం, శివకృష్ణ, మహేందర్, కృష్ణ, శంకరయ్య, రాములు, రాజకుమార్స్వామి, రామస్వామి, రమేశ్, నరేశ్‌కుమార్, నవీన్, శంకర్, నర్సింహులు, మాధవులు, శివ, చంద్రయ్యతో పాటు మరికొంత మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓట్ల కోసం అమలు కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజలంతా కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేశామని ఆలోచించుకుంటున్నారని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు. తెలంగాణలో మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతో ప్రజలంతా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ప్రజా వ్యతిరేక విధానాలపై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గూడూరు నర్సింగ్‌రావు, సీనియర్ నాయకులు శేరిగూడెం వెంకటయ్య, గడ్డం శ్రీనివాస్, నరేశ్ముదిరాజ్ తదితరులున్నారు.