Hyderabad Metro | సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): నిర్ణీత సమయంలో కచ్చితంగా గమ్య స్థానానికి చేరుస్తుంది. వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నగర వాసులకు ఊరటనిస్తుంది. అలాంటి ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు మొదటి స్థానంలో ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో ప్రజాదరణ పొందిన మెట్రో రైలులో నిత్యం 5లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో రైల్ కోచ్‌లను పెంచడంలో ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ కాలయాపన చేస్తోంది. ప్రయాణికుల డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నగరవాసులు నిత్యం కిక్కిరిసిన మెట్రో కోచ్‌ల్లోనే ప్రయాణం చేస్తూ నరకం అనుభవిస్తూనే ఉన్నారు.
కోచ్‌లు కొనడానికి డబ్బుల్లేవ్…?
మూడు కోచ్‌లు ఉన్న మెట్రోలో మరో 3 కోచ్‌లను అనుసంధానం చేయాలన్న డిమాండు ఏడాది నుంచి ఉంది. అయినా ఎల్ అండ్ టీ మెట్రో మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు. ఈ విషయమై ఎల్ అండ్ టీ మెట్రో యంత్రాంగాన్ని సంప్రదిస్తే అదనంగా మెట్రో కోచ్‌లు కొనడానికి డబ్బుల్లేవనే విషయాన్ని చెబుతున్నారు. కొన్నాళ్ల పాటు ఉన్న కోచ్‌లతోనే నడిపిస్తామని, ఆర్థికంగా లాభాలు వస్తే తప్ప ఇప్పటికిప్పుడు కొత్త కోచ్‌లను తీసుకురాలేని పరిస్థితిలో ఎల్ అండ్ టీ మెట్రో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగరంలో ఆరేండ్ల క్రితం ప్రారంభమైన సమయంలో తీసుకొచ్చిన మెట్రో రైళ్లనే ఇప్పటికీ వాడుతున్నారు. ప్రతియేటా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కోచ్‌లను పెంచాలని ఉన్నా లాభాలు రావడం లేదని, ఇంకా తీవ్ర నష్టాల్లోనే ఉన్నామని.. అదనపు కోచ్‌ల కొనుగోలు విషయాన్ని దాట వేస్తూ వస్తున్నారు. మూడు కోచ్‌లతో కూడిన ఒక్కో మెట్రో రైలును అదనంగా కొనుగోలు చేయాలంటే రూ.10 కోట్ల దాకా అవుతుంది. ప్రస్తుతం ఉన్న 59 మెట్రో రైళ్లలో సగం రైళ్లకు అదనంగా కోచ్‌లను జతపర్చాలంటే రూ.300 కోట్ల దాకా అవుతుంది. ఆ మొత్తాన్ని సైతం భరించేందుకు సిద్ధంగా లేదు. ఉన్న కోచ్‌లతోనే నిర్వహణ చేపట్టాలని, అవసరమైతే ఫ్రీక్వెన్సీ పెంచి నడుపుతామని చెబుతున్నారే తప్ప మెట్రో కోచ్‌లను తీసుకువస్తామన్న విషయం చెప్పడం లేదు.
మెట్రో ఆదరణ ఉన్నా ఆదుకునే వారేరి…?
నగరంలో ట్రాఫిక్ సమస్యలతో ప్రయాణికులు గంటల పాటు బస్సుల్లో ప్రయాణం చేయాల్సి వస్తోంది. నిర్ణీత సమయంలో ప్రయాణికులు గమ్య స్థానానికి చేరుకోవాలంటే మెట్రో రైళ్లే ఏకైక మార్గంగా మారాయి. అలాంటి మెట్రో రైలును ఆదుకోవాల్సిన అవసరం ఉన్నా, కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో కోచ్‌ల పెంపు విషయంలో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.