Hyderabad Metro | సిటీబ్యూరో, జనవరి 15(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో విస్తరణలో సెకండ్ ఫేజ్‌లోని పార్ట్-బీ అత్యంత కీలకంగా మారింది. ఇన్నాళ్లు మొత్తంగా 69కిలోమీటర్ల మేర మెట్రో రైలు మాత్రమే అందుబాటులో ఉండగా, రెండో దశ విస్తరణతో నగరంలో కొత్తగా 160 కిలోమీటర్లు అందుబాటులోకి రానున్నది. ఫేజ్-2ను రెండు భాగాలుగా పనులు చేపట్టేందుకు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లను తయారు చేసిన హెచ్ఏఎంఎల్ సంస్థ… తాజాగా పార్ట్-బీలో నార్త్ సిటీకి మెట్రోను విస్తరిస్తూ డీపీఆర్ సిద్ధం చేస్తున్నది. దీంతో ఫేజ్-1, ఫేజ్-2 కలిపి నగరంలో ప్రాజెక్టులతో మొత్తంగా 232 కిలోమీటర్ల పొడవైన మెట్రో నిర్మితం కానున్నది. నగరానికి మెట్రో పరిధిని పెంచడంలో ఫేజ్-2 ముఖ్యమైనదైతే, 90కిలోమీటర్ల మేర అతి పొడవైన పార్ట్-బీ ప్రాజెక్టు నగర మెట్రో విస్తరణలో ముఖ్యమైనదనీ నిపుణులు చెబుతున్నారు.
ఫోర్త్ సిటీకి డీపీఆరే ముఖ్యం..
కోర్ సిటీతో అనుసంధానం చేస్తూ గేట్ వే ఆఫ్ తెలంగాణగా పిలిచే నార్త్ హైదరాబాద్, ఫోర్త్ సిటీ ప్రాంతానికి మెట్రో పరుగులు పెట్టాలంటే డీపీఆర్ ముఖ్యమైనది. మూడు నెలల్లో ప్రాజెక్టు నివేదిక రూపొందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నది. ఈ క్రమంలో నగరంలో శివారు ప్రాంతాలకు మెట్రో నిర్మించేందుకు ఫేజ్-2 మెట్రో విస్తరణలో భాగంగా పార్ట్-బీలో జేబీఎస్ నుంచి శామీర్‌పేట్(22కి.మీ), ప్యారడైజ్ నుంచి మేడ్చల్(23కి.మీ) వరకు, ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీ వరకు (45కి.మీ) మేర మొత్తంగా 90 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గం నిర్మితం కానున్నది. తొలుత నార్త్ సిటీ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం ఫోర్త్ సిటీ-శంషాబాద్ ప్రాజెక్టును మాత్రమే ఫేజ్-2లో చేర్చిన ప్రభుత్వం డీపీఆర్ లేకుండా పార్ట్-ఏను మాత్రమే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఆ తర్వాత పార్ట్-బీలో ఫోర్త్ సిటీతోపాటు నార్త్ సిటీని కూడా చేర్చడంతో… నగరంలో మొత్తంగా రెండో దశ మెట్రో విస్తరణ 162 కిలోమీటర్లు అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే ఫేజ్-2 పార్ట్-ఏలో 76 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ సిద్ధం కాగా, పార్ట్-బీలో భాగంగా ఫోర్త్ సిటీ, ప్యారడైజ్-మేడ్చల్, జేబీఎస్-శామీర్‌పేట ప్రాంతాలు రానున్నాయి.
పార్ట్-బీతో 90 కిలోమీటర్లు..
ప్రస్తుతం ఫేజ్-1 ద్వారా మెట్రో కేవలం కోర్ సిటీ ప్రాంతాలకు మాత్రమే రాకపోకలు సాగించే వీలు కలిగింది. కానీ ఫేజ్-2లోని పార్ట్-బీ అందుబాటులోకి వస్తే 90 కిలోమీటర్ల పొడవైన మెట్రోతో శివారు ప్రాంతాల వరకు ప్రయాణించే వీలు కలుగనున్నది. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ఫోర్త్ సిటీకి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, కోర్ సిటీని అనుసంధానం చేసే మార్గం కూడా అందుబాటులోకి రానున్నది. పార్ట్-బీ ద్వారానే ఏకంగా 90 కిలోమీటర్ల మెట్రో నిర్మితం కానున్నది. ఫేజ్-2 పార్ట్-బీగా డీపీఆర్‌ను మూడు నెలల్లో సిద్ధం అవుతుంది. హైదరాబాద్ నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా మెట్రో విస్తరణతో రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నదని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే మియాపూర్ వరకు మెట్రో సౌకర్యం ఉన్నది. ఇక్కడి నుంచి పటాన్చెరు వెళ్లేందుకు రోడ్డు రవాణా సదుపాయం కూడా ఉన్నది. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రో విస్తరించినా పెద్దగా వచ్చే ప్రయోజనం ఉండదు. అదేవిధంగా ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో విస్తరించినా ఆశించిన స్థాయి ప్రయోజనాలు ఉండవు. కానీ కోర్ సిటీ నుంచి శివారులో ఉండే మేడ్చల్, శామీర్‌పేట్, శంషాబాద్, ఫోర్త్ సిటీ వంటి ప్రాంతాల అనుసంధానంతో నగరంలో పొడవైన రవాణా సౌకర్యం నగర వాసులకు అందుబాటులోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.