పరిగి, జూలై 9 : పరిగి-వికారాబాద్, పరిగి-షాద్‌నగర్ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్భాటంగా శంకుస్థాపన చేయడంతోపాటు పలుమార్లు శరవేగంగా రోడ్డు పనులు సాగుతున్నాయని అధికార పార్టీ వారు సోషల్ మీడియాలో హల్చల్ చేయగా వాస్తవానికి ఈ పనులు మాత్రం నెమ్మదించాయి. పరిగి-వికారాబాద్ రోడ్డు విస్తరణ నెలన్నర రోజులుగా సాగడం లేదు. కేవలం రెండు బ్రిడ్జిలే నిర్మించారు. పరిగి నుంచి వికారాబాద్ రోడ్డు 18 కిలోమీటర్లు, పరిగి నుంచి షాద్‌నగర్ రూట్లో 14.8 కిలోమీటర్లు, మొత్తం 32.8 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు సుమారు రూ.240 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఏడు మీటర్ల రోడ్డును ఇరువైపులా 8.5 మీటర్లు, మధ్యలో 1.5 మీటర్ల డివైడర్‌తో కలిపి 18.5 మీటర్లకు వెడల్పును విస్తరించాలి. దీంతోపాటు పరిగి-వికారాబాద్ రోడ్డులో మూడు బ్రిడ్జిలు, 10 కల్వర్టులు, షాద్‌నగర్ రోడ్డులో ఆరు బ్రిడ్జిలు, 14 కల్వర్టులను నిర్మించాల్సి ఉన్నది. ఆర్భాటంగా పనులైతే మొదలు పెట్టారు తప్ప ఆశించిన స్థాయిలో వేగంగా జరగడంలేదు.
వికారాబాద్ దారిలో నిలిచిన పనులు
పరిగి నుంచి వికారాబాద్ రూట్లో 18 కిలోమీటర్ల రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించగా గత కొద్ది రోజులుగా నిలిచిపోయాయి. విస్తరణలో భాగంగా ఇరువైపులా మొక్కల తొలగింపు, అనేక చోట్ల పనులు చేపట్టి మట్టి పోయడంతోపాటు కంకర వేశారు. కంకర చదును చేసి వది లేశారు. సుమారు నెల రోజులకు పైగా పరిగి-వికారాబాద్ రూట్లో రోడ్డు పనులు నిలిచిపో యాయి. కేవలం రెండు బ్రిడ్జిల పనులే సాగుతున్నాయి. పరిగి-షాద్‌నగర్ రోడ్డులోనూ అక్కడ క్కడే పనులు జరుగుతుండడం గమనార్హం. 2025 డిసెంబర్లో పనులు ప్రారంభమవగా సుమారు 8 నెలల్లో కేవలం 15 శాతం లోపు రూ. 30కోట్ల లోపే పనులు జరిగినట్టు సమాచారం. కాగా, రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న ఆర్అండ్బీ అధికారులు మాత్రం పనులు ఎక్కడా నిలిచిపోలేదని.. కొనసాగుతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉన్నది. ఇంత నత్తనడకన జరుగుతుంటే ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా రోడ్డు విస్తరణ జరిగే సమయంలో ఒకవైపు పనులు పూర్తిచేసి మరోవైపు చేపడతారు. కానీ, ఇక్కడ రెండు వైపులా ప్రారంభించడం గమనార్హం. షాద్‌నగర్ రోడ్డులో చెట్లు తొలగించిన తర్వాత వాటి కాండాన్ని భూమిలో నుంచి పూర్తిస్థాయిలో తొలగించకుండానే అక్కడక్కడ పనులు చేపట్టారనే ఆరోపణలున్నాయి.
ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు
రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదు ర్కొం టున్నారు. పరిగి-వికారాబాద్ రోడ్డులో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటా యి. అంతకంటే అధికంగా పరిగి-షాద్‌నగర్ రోడ్డులో వాహనాల రద్దీ ఉంటుంది. జిల్లా కేం ద్రమైన వికారాబాద్‌కు ఏ పని కోసం వెళ్లాలన్నా రోడ్డు పనులతో ఇబ్బందిగా మారింది. మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు కర్ణాటక రాష్ర్టానికి చెందిన అనేక ప్రాంతాల వారు పరిగి-షాద్‌నగర్ రూట్లోనే రాకపోకలు సాగిస్తారు.
అలాగే కొడంగల్, తాండూరు, కోస్గిలకు చెందిన వారు కూడా ఈ దారినే రాకపోకలు సాగిస్తుంటారు. పనులు మందకొడిగా సాగడం, అక్కడక్కడే పనులు కొనసాగుతుండడంతో వాహనదారుల వెతలు అన్నీ ఇన్నీ కావని చెప్పొచ్చు. రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్అండ్బీ పరిగి డిప్యూటీ ఈఈ సురేందర్‌ను వివరణ కోరగా పనులు సాగుతున్నాయని చెప్పారు. వర్షాలు, మెటీరియల్ కొరత, లేబర్ సమస్యలతో పనులు కొంత నెమ్మదిగా జరుగుతున్నాయని.. త్వరలోనే పనుల్లో వేగం పెరుగుతుందన్నారు.
నిలిచిన రోడ్డు పనులతో ఇబ్బంది
పరిగి నుంచి వికారాబాద్ రోడ్డు విస్తరణ పనులు గత నెల రోజులకు పైగానే కొనసాగడం లేదు. కేవలం రెండు బ్రిడ్జిలు మినహా పనులు జరగడం లేదు. రోడ్డుపై కంకర వేసి వదిలేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఆర్అండ్బీ అధికారులు స్పందించి రోడ్డు పనులు సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
-మేడిద రాజేందర్, నస్కల్