RK Roja | రాజకీయాల్లో ‘ఓటుకు నోటు’ సంస్కృతికి పితామహుడు చంద్రబాబు నాయుడే అని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా విమర్శించారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడు మహిళలు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారంటూ వారికి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని తీవ్రంగా మండిపడ్డారు. డబ్బుతో రాజకీయాలు నడిపిన చరిత్ర ఉన్న వ్యక్తి.. మహిళలను డబ్బుకు అమ్ముడుపోయేవారిగా చిత్రీకరించడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. చంద్రబాబు మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నగరిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన రోజా.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహిళలను తన నివాసానికి పిలిచి భోజనం పెట్టిన అనంతరం వారిని అవమానించేలా చంద్రబాబు మాట్లాడారని ఆరోపించారు. ఎన్నికల్లో మహిళలు ఓటుకు రూ.2 వేలు తీసుకున్నారని, అలాంటి వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోయారన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. “మీరు రూ.2,000 ఓటుకు తీసుకుంటే.. ఆ తీసుకున్న వ్యక్తి రూ.2 లక్షలు సంపాదించాలనుకుంటాడు.. మీకు ఎలా మంచి చేయగలుగుతాడు?” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలను ఎవరు ఏది ఇస్తే అది తీసుకునే వారిలా మాట్లాడటం వారి ఆత్మగౌరవాన్ని అవమానించడమేనన్నారు.
చంద్రబాబు తన రాజకీయ చరిత్రను గుర్తు చేసుకున్న తర్వాతే మహిళలకు నీతులు చెప్పాలని రోజా అన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన సమయంలో ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడానికి డబ్బును ఉపయోగించారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో చోటుచేసుకున్న ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో చంద్రబాబు ఆడియో, వీడియోలతో సహా దొరికిపోయారని రోజా విమర్శించారు.
“డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేయడం, రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. అలాంటి వ్యక్తి మహిళలు ఓటుకు డబ్బులు తీసుకున్నారని మాట్లాడటం హాస్యాస్పదం” అని రోజా అన్నారు. రాజకీయాలకు ‘ఓటుకు నోటు’ సంస్కృతిని పరిచయం చేసిన వ్యక్తే ఇప్పుడు మహిళలకు ఓటు విలువ గురించి పాఠాలు చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని రోజా విమర్శించారు.
జెండా పండుగ రోజు మహిళలను అవమానించిన చంద్రబాబు..ముందు వారికి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నీతులు చెబితే ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్పినట్టు ఉంది. డబ్బుతో వ్యవస్థలు మేనేజ్ చేయడం @ncbn అలవాటు.
-ఆర్కే రోజా గారు, మాజీ మంత్రి pic.twitter.com/IxdiYcCzS0
— YSR Congress Party (@YSRCParty) August 16, 2026
డబ్బుతో ఎన్నికలు గెలిచే రాజకీయాలకు తాము వ్యతిరేకమని చంద్రబాబు చెబితే.. ముందుగా తాను, తన కుమారుడు లోకేశ్, మంత్రులు, ఎమ్మెల్యేలు భవిష్యత్తు ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పోటీ చేస్తామని ప్రమాణం చేయాలని రోజా సవాల్ చేశారు. “ఓటుకు నోటుపై నీతులు చెప్పడం కాదు.. ముందు మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ఆ తర్వాత ఇతరులకు నీతులు చెప్పండి” అని హితవు పలికారు. ఎన్నికల సమయంలో మహిళలను ‘అమ్మ, చెల్లి, తల్లి’ అంటూ ఓట్లు అడిగిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మహిళలను డబ్బుకు ఆశపడేవారిగా చిత్రీకరించడం ఆయన రాజకీయ వైఖరికి నిదర్శనమన్నారు.
రెండు ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు.. ఈ రోజు లక్ష కోట్లకు ఎదిగారని చెబుతున్నారని రోజా అన్నారు. ఇంత భారీగా ఆస్తులు ఎలా సంపాదించారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఇసుక, గ్రావెల్, కంకర, గ్రానైట్ వంటి సహజ వనరులపై అధికార పార్టీ నాయకులు దోపిడీ చేస్తున్నారని, దానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆరోపించారు. అమరావతి, పోలవరం, విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర కాంట్రాక్టుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాష్ట్ర వనరులను బినామీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు.
మహిళలపై నీతులు చెప్పే ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని రోజా డిమాండ్ చేశారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెన్షన్, రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ మహిళలకు నెలకు రూ.3 వేల సాయం వంటి హామీలను అమలు చేయాలని కోరారు. మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన దిశా చట్టాన్ని రద్దు చేశారని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా అందుబాటులోకి రావడంతో మహిళలు, బాలికల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు.
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని రోజా విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి రాష్ట్ర వనరులను దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. “ముందు మీరు ఇచ్చిన హామీలను 100 శాతం నెరవేర్చండి.. ఆ తర్వాత ఇతరులకు నీతులు చెప్పండి” అని చంద్రబాబుకు రోజా సూచించారు. ప్రజల డబ్బుతో విదేశీ పర్యటనలు చేస్తూ.. వాటి వివరాలను కూడా పారదర్శకంగా వెల్లడించడం లేదని ఆమె విమర్శించారు. బినామీలకు రాష్ట్ర వనరులు దోచిపెడుతున్నారని ఆరోపించారు.
మహిళలు కుటుంబాలను నిలబెట్టే శక్తి అని రోజా అన్నారు. కుటుంబ సంక్షేమం, పిల్లల చదువులు, అత్తమామల బాధ్యతలను చూసుకునే మహిళలను డబ్బు కోసం వెంపర్లాడేవారిగా చిత్రీకరించడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు చంద్రబాబుకు, టీడీపీకి తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. డబ్బు రాజకీయాలపై మహిళలకు నీతులు చెప్పే ముందు చంద్రబాబు తన రాజకీయ చరిత్రను ప్రజల ముందు పెట్టాలని.. ఇచ్చిన హామీలను నెరవేర్చి, ఆ తర్వాత ఇతరులను ప్రశ్నించాలని రోజా స్పష్టం చేశారు.