పరిగి : పరిగిని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుదామని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పరిగిలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో చెత్త సేకరణ వాహనాలు, ఒక ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి రెండు వార్డులకు ఒక వాహనం ద్వారా చెత్త సేకరణ చేపట్టాలని సూచించారు. పరిగి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి చెత్త సేకరణ వాహనంలో వేయాల్సిందిగా పేర్కొన్నారు. చెత్తను బయట పారవేయరాదని, తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మంచి వాతావరణం ఉంటుందన్నారు.
పరిగిలో రూ. 10కోట్ల విలువ చేసే పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయని, ఈ పనులు పూర్తయితే పట్టణం మరింత సుందరంగా మారుతుందని చెప్పారు. మిగతా నిధులతో పనులు చేపట్టడం జరుగుతుందని, మున్సిపల్ నిధులతోను ఆయా వార్డుల్లో ప్రాధాన్యత క్రమంలో నిధులు వెచ్చించి పనులు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి దుస్తులు అందజేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, జడ్పీటీసీ హరిప్రియ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్. ఆంజనేయులు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్లు ఎదిరె కృష్ణ, వారాల రవీంద్ర, వెంకటేశ్, మునీర్, నాగేశ్వర్, కో-ఆప్షన్ సభ్యుడు ముకుంద శేఖర్ పాల్గొన్నారు.