పరిగి : కరోనా కట్టడిలో భాగంగా చేపడుతున్న ఇంటింటి జ్వర సర్వే తుది దశకు చేరుకుంది. వికారాబాద్ జిల్లాలో ఎనిమిదవ రోజు 353 ప్రత్యేక బృందాలు 12908 కుటుంబాల జ్వర సర్వే చేపట్టారు. జిల్లా పరిధిలో మొత్తం 22,0386 కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు 21,7014 కుటుంబాల సర్వేను పూర్తి చేయడం జరిగింది. జిల్లాలోని నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మినహా, మిగతా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటి జ్వర సర్వే పూర్తయింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లిన ప్రత్యేక బృందాలు జలుబు, దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు వంటి లక్షణాలు ఉన్నాయా అడిగి తెలుసుకోవడంతో పాటు ఈ లక్షణాలు ఉన్న వారికి మందులు పంపిణీ చేశారు. అలాగే అర్హులందరూ కొవిడ్ టీకా వేయించుకోవాల్సిందిగా సూచించారు.
జిల్లా పరిధిలో శుక్రవారం 15నుంచి 17ఏళ్ల లోపు వారు 382మందికి మొదటి డోసు, 18ఏళ్లు పైబడిన వారిలో 741మందికి మొదటి డోసు, 2046 మందికి రెండవ డోసు, 60 ఏళ్లు పైబడిన వారిలో 79 మందికి ప్రికాషనరీ డోసు కోవిడ్ టీకా వేశారు.