Kothuru | కొత్తూరు, మార్చి 19 : పల్లెల్లో నాటి పచ్చదనం కన్పించడం లేదు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పచ్చదనంతో వెల్లివిసిరన గ్రామాలు నేడు కళావిహీనంగా మారాయి. పల్లెప్రకృతి వనాలు, ఎవెన్యూ ప్లాంటేషన్‌తో కళకళలాడిన పల్లెలో ఎక్కడ చూసినా ఆ పచ్చదనం కన్పించడం లేదు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గ్రామానికో పల్లెప్రకతి వనాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ పల్లె ప్రకృతి వనాలను నేడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
కొత్తూరు మండలంలోని పెంజర్ల పల్లెప్రకృతి వనాన్నిపట్టించుకునే వారు లేక ఎండిపోయింది. అక్కడ చెట్లకు నీళ్లు పట్టడానికి బోరు మోటర్ ఉన్నా నీరు పెట్టే నాథుడే కరువయ్యాడు. గతమెంతో ఘనకీర్తిలా వెలిగిన పెంజర్ల ప్రకృతివనం నేడు పట్టించుకునేవారు లేకపోవడంతో చెట్లు ఎండిపోయి కళావిహీనంగా తయారయింది. కొత్తూరు మండలంలోనే పెంజర్ల పల్లెప్రకృతి వనం ఏపుగా పెరిగి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది.
కానీ నేడు దాన్ని పట్టించుకునేవారు లేక ఎండిపోయి వెలవెల పోతుంది. ఈ విషయంపై పెంజర్ల పంచాయతీ కార్యదర్శిని గౌస్‌ను ప్రశ్నించగా తాను ఈ మధ్యనే బదిలీపై వచ్చానని చెప్పాడు. వచ్చినప్పటి నుంచి పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్‌గా వెళ్తున్నానని చెప్పాడు. వీలైనంత త్వరలో ప్రల్లెప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కలకు నీరు అందేలా చర్యలు తీసుకుంటానని వివరించారు.