పర్యావరణ హితాన్ని కోరుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది నందిగామ మండలంలోని కన్హా గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. ఊరులోకి అడుగుపెట్టగానే దారులకు ఇరువైపులా వేలాడే ఉద్యానవనాలు స్వాగతం పలుకుతాయి. ఎటుచూసినా రకరకాల మొక్కలతో గ్రామం మొత్తం ఒక బృందావనాన్ని తలపిస్తున్నది. అంతేకాకుండా గ్రామానికి జాతీయస్థాయి పురస్కారం సైతం లభించింది. పర్యావరణం-ప్రకృతి విభాగంలో కన్హా గ్రామ పంచాయతీకి ‘కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ’ అవార్డును ఇటీవల కేంద్రం ప్రదానం చేసింది.
రంగారెడ్డి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): సమాజ శ్రేయస్సు, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ జిల్లాలోని నందిగామ మండలంలోని కన్హా గ్రామం దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలుస్తున్నది. అడవులను పెంచేందుకు పర్యావరణ ఉద్యమాన్నే చేపట్టింది.. గ్రామం మొత్తం ఒక ఉద్యాన వనంలా లేక బృందావనంలా ఉంటుంది. ఎటుచూసినా ఆకుపచ్చని పరిసరాలు అలరారుతుంటాయి. వేలాడే ఉద్యానవనాలతో ద్రాక్ష తోటలను పోలినట్లు పలు దారులు స్వాగతిస్తుంటాయి. ఈ గ్రామం 400 ఎకరాల్లో విస్తరిం చి ఉంటుంది. ఇందులో 3000 మందికి పైగా ప్రజ లు జీవిస్తున్నారు. ఎటుచూసినా చెత్తాచెదారం అస లే కనిపించదు. వీధులన్నీ శుభ్రంగా కనిపిస్తాయి. చెత్తాచెదారంతో వర్మీకంపోస్ట్ తయారు చేసి దానిని మొక్కలకు ఎరువుగా వినియోగిస్తున్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పల్లెలను పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా సుందరంగా తీర్చిదిద్దుతున్నది. మౌలిక వసతుల కల్పనకు గ్రామాలకు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నది. ఆ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, విద్యుత్‌దీపాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యా ర్డులు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు, హరితహారం నర్సరీలు, పల్లెప్రకృతివనాలు తదితర అభివృద్ధి పనులను చేపడుతున్నారు. దీంతో మన పల్లెలు పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ మెరుస్తున్నా యి. ఇందులో భాగంగానే కన్హా గ్రామ పంచాయతీ పర్యావరణం-ప్రకృతి విభాగంలో రాష్ట్రం నుంచి కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ అవార్డుకు ఎం పికై.. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ చౌహా న్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా కన్హా సర్పంచ్ సరి త, పంచాయతీరాజ్ కార్యదర్శి శ్రీనివాస్ అవార్డును అందుకున్నారు. 2025 నాటికి దేశమంతటా కనీ సం 30 మిలియన్ల స్థానిక, స్థానికేతర మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం అటవీ, వ్యవసాయ- అటవీ, వాతావరణ నిపుణుల బృందాలు చర్యలు తీసుకుంటున్నా యి. ఆ బృందాల సూచనల మేరకు మొదటిదశగా దేశవ్యాప్తంగా 18 నగరాల్లో నర్సరీలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో పలు రకాల ఎంపిక చేసిన చెట్లు, మొక్కల జాతులను పెంచుతారు. వాటిని హార్ట్ఫుల్నెస్ వలంటీర్లు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలల విద్యార్థులు, సాధారణ ప్రజలు పర్యవేక్షిస్తారు. ఎఫ్‌బీహెచ్ ఇప్పటికే తన వలంటీర్లు, దాని భాగస్వామ్య సంస్థల ద్వారా ఒక రోజులో 64 నగరాలలో 64 వేల చెట్లను కవర్ చేస్తూ 2019లో విజయవంతమైన మాస్ ప్లాంటేషన్ డ్రైవ్‌ను నిర్వహించింది.
కన్హా శాంతివనం హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలోని చేగూర్ గ్రామ సమీపంలో 1400 ఎకరాలలో విస్తరించి ఉన్నది. దీని ఆధ్వర్యంలోనే 400 ఎకరాలలో కన్హా గ్రామ పంచాయతీ ఏర్పడింది. అదేవిధంగా హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో యోగా/ఆధ్యాత్మిక కార్యక్ర మాలు కొనసాగుతాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శ్రీరామచంద్ర మిషన్ సహకారంతో కన్హా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతున్నాం. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నాం. దాని ఫలితంగానే రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులొచ్చాయి. అవార్డులు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. కన్హా గ్రామం మాదిరిగా మరిన్ని పంచాయతీలు కూడా పర్యావరణ పరిరక్షణకు ముందుకు రావాలి. ప్రకృతికి విఘాతం కలిగించొద్దు. మొక్కలను పెంచి కాలుష్యాన్ని, గ్లోబల్ వార్మింగ్‌ను నివారిద్దాం.
– సరిత, సర్పంచ్, కన్హా గ్రామం, నందిగామ
కన్హా గ్రామంలో ఎటుచూసినా పచ్చని వాతావర ణం కనిపిస్తున్నది. గతం లో ఈ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం హరిత అవార్డును అందించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జాతీయ స్థాయిలోనూ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. రెట్టింపు ఉత్సాహంతో పని చేసి గ్రామాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం.
– శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, కన్హా గ్రామం