రంగారెడ్డి, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వరి కోతలు ముమ్మరమయ్యాయి. అలాగే, కొనుగోలు కేంద్రాల వద్దకూ ధాన్యాన్ని విక్రయించేం దుకు రైతులు క్యూ కడుతుండడంతో హమాలీల కొరత తీవ్రంగా ఉన్న ది. ఈ కేంద్రాల్లో బీహార్‌కు చెందిన వారే హమాలీ పనులు నిర్వహిస్తున్నారు. కాగా, అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో వారు తమ రాష్ర్టానికి వెళ్లిపోవడంతో ధాన్యం కొనుగోళ్లు మందగించాయి. దీంతో రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాల వద్ద కుప్పలుగా పోసి నిల్వ ఉంచారు.
కొన్ని కేంద్రాల్లో ఏజెన్సీల ద్వారా కూలీలను తీసుకొచ్చి పనులు చేయిస్తుండగా.. మరికొన్ని చోట్ల అడ్డా కూలీలతో నెట్టు కొస్తున్నా.. రైతులు వడ్లను మూడు, నాలుగు రోజులుగా కల్లాల వద్దే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఈ వానకాలంలో 1,60,000 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా.. 3.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం తీసుకొస్తున్నారు. రానున్న మరో వారం రోజుల్లో మరింత పెరిగే అవకాశమున్నది.
జిల్లాలో 35 కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం 35 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో 22 కేంద్రాలు పీఏసీఎస్ ఆధ్వర్యంలో, 9 ఐకేపీ, 4 డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత యాసంగిలో జిల్లాలో 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన అధికారులు..ఇప్పుడు మరో 10,000 టన్నుల ధాన్యాన్ని అధికం గా సేకరించాలని భావిస్తున్నారు.
తరుగు పేరుతో రైతులకు టోపీ..
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తరుగు పేరుతో అక్కడి సిబ్బంది టోపీ పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. సంచి బరువుతోపాటు ఇతర తరుగు పేరిట క్వింటాల్‌కు కిలో నుంచి రెండు కిలోల వరకు ఎక్కువగా తూకం వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులకు అక్కడి సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ఆరబెట్టి, తూర్పాల పట్టి తీసుకొస్తేనే కొంటున్నారు. లేకుంటే తేమ పేరిట ఇబ్బందిపెడుతున్నారు. దీంతో చాలామంది రైతులు తక్కువ ధరకైనా మధ్య దళారులకు విక్రయించి నష్టపోతున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు..
ఇబ్రహీంపట్నం : నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై అధికారులు శ్రద్ధ చూపడంలేదని రైతులు మండిపడుతున్నారు. కేంద్రాలను ప్రారంభించినా వాటిలో కొనడంలేదని పేర్కొంటున్నారు. మంచాల, యాచారం మండలాల్లోని కేంద్రాల్లో అక్కడి సిబ్బంది అనేక కొర్రీలు విధిస్తుండడంతో అన్నదాతకు గిట్టుబాటు ధర రావడంలేదని ఆరోపిస్తున్నారు.
ఆ కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్తే పలు సాకు లు చెబుతూ తూకం వేయడంలేదని.. దీంతో ఎక్కువ రోజులు కల్లాల్లో ఉంచలేక తక్కువ ధరకే దళారులకు విక్రయించి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర రూ. 2,385 చెల్లిస్తుం డగా.. మధ్యదళారులు రూ.2,000లకే కొంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ముంథా తుఫాన్ అన్నదాతను తీవ్రంగా ముంచింది.
కొనుగోళ్లలో దళారులదే పైచేయి
నియోజకవర్గంలో వరికోతలు ఊపందుకున్నాయి. అన్నదాతలు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే.. తేమ అని..ఇతర సమస్యలు చెప్పి అక్కడి సిబ్బంది కొనుకుండా నిర్లక్ష్యం చేస్తుండడంతో రైతులు మద్దతు ధర రాకున్నా క్వింటాకు రూ.2 ,000 చొప్పున చెల్లించినా మధ్య దళారులకే విక్రయిస్తున్నారు. మంచాల, యాచా రం మండలాల్లోని గ్రామీణ ప్రాంతా ల్లో దళారులు వ్యవసాయ పొలా ల వద్దే అన్నదాతల నుంచి ధాన్యాన్ని కొంటున్నారు.
నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర మండలాల్లో వరి కోతలు ముమ్మరమైన నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి. మద్దతు ధర రాని రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఎక్కడికక్కడ రోడ్లపై ఆరబోసి రైస్‌మిల్లులకు తరలించి బియ్యాన్ని పట్టించుకుంటున్నారు. మరికొంతమంది కల్లాల్లోనే వారాల తరబడి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కొర్రీలు లేకుండా ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని రైతులు కోరుతున్నారు.