రంగారెడ్డి, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని రైతులకు వరి సాగు కత్తిమీది సాములా మారింది. ఏటేటా ఖర్చులు పెరుగుతున్నా సరిపడా ఆదాయం సమకూరకపోవడంతో అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. గత బీఆర్ఎస్ హయాంలో సాగుకు ముందే పంట సాగుకు రైతుబంధు పెట్టుబడి సాయం అందేది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో రైతులకు సకాలంలో రైతుభరోసా అందకపోవడంతో పంట సాగు కోసం అన్నదాత అప్పులు చేయాల్సి వస్తున్నది.
అలాగే, పంట గిట్టుబాటు ధర రాకపోవడంతో పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రైతుకు అందని పరిస్థితి. మరోవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం కూడా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పొలాలు దున్నటం, వరినాట్లు వే యటం, వరికోతలు, వడ్లను తూర్పాల పట్ట డం వంటి వాటికి యంత్రాలనే వినియోగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటంతో యంత్రాల వాడకానికి కూడా ఖర్చులు పెరిగాయి. గతంలో ట్రాక్టర్కు గంటకు రూ.600 ఉండగా..ప్రస్తుతం రూ.1,000 తీసుకుంటున్నారు. అలాగే, ఎరువుల ధరలూ విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితిలో జిల్లా రైతాంగం వ్యవసాయ సాగంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి.
1,68,000 ఎకరాల్లో..
జిల్లాలో ఈ వర్షాకాలంలో 1.68 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. గత యాసంగిలో 1.32 లక్షల ఎకరాలు సాగు కాగా.. 40 వేల మెట్రిక్టన్నుల ధాన్యం మాత్రమే దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేసి అందుకనుగుణంగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ, కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో సరైన పారదర్శకత లేకపోవటం తో రైతులు మధ్య దళారులకు ధాన్యం విక్రయించి అప్పుల పాలయ్యారు. అలాగే, ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలూ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. నారుమడులు దున్నటం నుంచి వరి పంటలు కోసే వరకు రైతులు ఎక్కువగా యంత్రాలను వినియోగిస్తున్నారు. ట్రాక్టర్లు, వరికోత మిషన్లకు పెట్రోల్, డీజిల్ వాడటం తో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం తో వాటి కిరాయిలు కూడా భారీగా పెంచారు. ఈ ప్రభావం తీవ్రంగా కుంగదీసేలా ఉందని రైతులు వాపోతున్నారు.
పెరిగిన ఎరువుల ధరలు..
వానకాలం సాగుకు ముందే రైతులకు ఎరువుల ధరల రూపంలో భారీ షాక్ తగిలింది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు రూ.100 నుంచి రూ.500 వరకు పెరిగాయి. మరోవైపు డీఏపీ ఎరువులూ భారీగా పెరిగాయి. గతంలో రూ. వెయ్యి బస్తా ఉన్న డీఏపీ రూ.1300-రూ. 1400లకు పెరిగింది.
అందని రైతుభరోసా..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంటల సాగుకు ముందే రైతుబంధు పథకం కింద అన్నదాత కు పెట్టుబడి సాయం అందేది. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పం టలు సాగు చేసుకునే వారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి రైతుభరోసా సక్రమంగా రావడంలేకపోవడంతో అన్నదాత అప్పులు చేసి పంటలను సాగు చేస్తున్నాడు.